ఖానాపూర్, జూలై 22
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలభారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) ఆధ్వర్యంలో ఖానాపూర్ మండలం కొత్తగూడెంలో ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు ఎత్తివేస్తే దేశీయ రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఏఐకేఎంఎస్ ఆందోళన వ్యక్తం చేసింది.
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని అఖిలభారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) డిమాండ్ చేసింది. ఖానాపూర్ మండలం రంగాపేట గ్రామపంచాయతీ పరిధిలోని కొత్తగూడెంలో బుధవారం ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్.ఆర్. ఉపాలి మాట్లాడుతూ.. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను పూర్తిగా ఎత్తివేస్తే దేశీయ రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పత్తి, మొక్కజొన్న, వరి, పసుపు, సోయాబీన్, వంటనూనెలు, యాపిల్స్, డెయిరీ, పాల ఉత్పత్తుల ధరలు భారీగా పడిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు.
అమెరికా రైతులకు భారీ సబ్సిడీలు అందుతున్నప్పటికీ, మన దేశంలో రైతులకు కనీస మద్దతు ధరలు సక్రమంగా అమలు కావడం లేదని విమర్శించారు. అన్ని పంటలకు చట్టబద్ధమైన గ్యారెంటీతో కనీస మద్దతు ధర అమలు చేయాలని, స్వామినాథన్ కమిషన్ సిఫారసులను పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని ఉపసంహరించుకునే వరకు ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఉద్యమాలు కొనసాగిస్తామని, రైతుల హక్కుల కోసం ఏఐకేఎంఎస్ నిరంతరం పోరాడుతుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా సహాయ కార్యదర్శి గోగు శేఖర్, జిల్లా కమిటీ సభ్యులు గుట్ల ప్రసాద్, గోనే స్వామి, అత్రం గణేష్, సోయం గంగారం, కనుక చంద్రకళ, నైతం లింగుబాయి, నర్సపల్లి గంగవ్వ, మాదాసు బుచ్చవ్వ, గుట్ల లక్ష్మి, పేద్రం సుశీల, నల్లపు రాజవ్వ, సీడం గంగుబాయి తదితర రైతులు పాల్గొన్నారు.












