కుబీర్ మండలంలో రైతుల అవసరాన్ని దుర్వినియోగం చేస్తూ అక్రమంగా యూరియా నిల్వలు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యవహారం వెలుగుచూసింది. లైసెన్సు గోదాంలో కాకుండా ప్రైవేట్ గోదాంలో యూరియా బస్తాలను నిల్వ చేయడం, అనంతరం అదే గోదాం నుండి రైతులకు పంపిణీ చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించినట్లు సమాచారం.
స్థానికంగా ఒక ఫర్టిలైజర్ వ్యాపారి బుధవారం రాత్రి లైసెన్సు గోదాంలో కాకుండా ప్రైవేట్ గోదాంలో యూరియా బస్తాలను డంప్ చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని కొందరు రైతులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా, లైసెన్సు లేని గోదాంలో నిల్వలు చేయడం చట్టరీత్యా నేరమని అధికారులు స్వయంగా పేర్కొన్నారు. గోదాంను సీజ్ చేస్తామని నాలుగు రోజులుగా చెబుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం స్థానికుల్లో అనుమానాలను రేకెత్తించింది.
ఇదిలా ఉండగా, శనివారం రోజున అదే ప్రైవేట్ గోదాంలో నుంచి కొందరు రైతులకు యూరియా బస్తాలను పంపిణీ చేయడం మరింత చర్చనీయాంశమైంది. గత నాలుగు రోజులుగా యూరియా ఇవ్వకుండా ఆలస్యం చేసిన అధికారులు, ఒక్కసారిగా వచ్చి పంపిణీ చేయడం వెనుక ఉద్దేశం ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. విచారణ పూర్తికాకముందే పంపిణీ జరగడం అధికారుల తీరుపై అనుమానాలను బలపరుస్తోంది.
ఈ వ్యవహారం జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లగా, పూర్తి స్థాయి విచారణ జరిపి సోమవారం నాటికి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం. అయితే, విచారణ ప్రక్రియ కొనసాగుతుండగానే పంపిణీ జరగడం అధికారుల నిష్క్రియాపరత్వం లేదా ప్రమేయంపై తీవ్రమైన సందేహాలను రేకెత్తిస్తోంది. లైసెన్సు లేని గోదాంలో నిల్వ చేసిన ఫర్టిలైజర్ యజమానిపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తే, అధికారులు మరియు ఫర్టిలైజర్ వ్యాపారులు కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వెంటనే జిల్లా ఉన్నతాధికారులు స్పందించి విజిలెన్స్ విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

