బైంసాలో మహిళా రైతులకు 100% సబ్సిడీపై సోయా విత్తనాలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఆధునిక వ్యవసాయ పద్ధతులను పాటించాలని సూచించారు.
బైంసాలోని ఐకెపి కార్యాలయంలో కుభీర్, భైంసా, ముధోల్ మండలాలకు చెందిన మహిళా రైతులకు 670 బస్తాల సోయా విత్తనాలను 100% సబ్సిడీపై పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వం నూనె గింజల పంటల ప్రోత్సాహకంలో భాగంగా ఈ రాయితీలు అందిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.
మహిళలు సంఘాలుగా ఏర్పడి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా ఆర్థిక పురోగతి సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు చేపడుతోందని, గ్రామాల్లో నిర్మిస్తున్న మహిళా సమైక్య సంఘ భవనాలకు కేంద్ర నిధులే వినియోగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేను సంఘ సభ్యులు ఘనంగా స్వాగతించి, సత్కరించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావ్ పటేల్, ఆత్మ చైర్మన్ సిద్ధం వార్ వివేక్, స్థానిక సర్పంచ్లు, వ్యవసాయ అధికారులు, మహిళా సంఘ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.












