Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 28
వ్యవసాయ రంగాన్ని మరింత సులభతరం చేసి రైతులకు లాభదాయకంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన 'రైతు నేస్తం' 100వ ఎపిసోడ్ ప్రత్యేక కార్యక్రమంలో ఆయన వర్చువల్‌గా పాల్గొన్నారు.
వ్యవసాయ రంగాన్ని మరింత సులభతరం చేసి రైతులకు లాభదాయకంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన 'రైతు నేస్తం' 100వ ఎపిసోడ్ ప్రత్యేక కార్యక్రమంలో ఆయన వర్చువల్‌గా పాల్గొని రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. జిల్లాలోని సోన్ మండల రైతు వేదిక నుంచి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, అధికారులు, రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగులో మార్పులు చేసుకోవాలని మంత్రి సూచించారు. ఆరుతడి, ఉద్యానవన పంటలు, ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహిస్తూ నేల స్వభావం, నీటి లభ్యత, మార్కెట్ అవకాశాలకు అనుగుణంగా పంటల మార్పిడి విధానాలు పాటించాలని కోరారు. రసాయన ఎరువులను మితంగా వినియోగించి శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులు అవలంబించాలని సూచించారు.
'రైతు నేస్తం' ద్వారా ఆధునిక వ్యవసాయ సాంకేతికత రైతులకు చేరువవుతోందని మంత్రి తెలిపారు. రైతులకు క్షేత్రస్థాయిలో మార్గనిర్దేశం చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. అనంతరం పంట మార్పిడి ద్వారా విజయాలు సాధించిన రైతులను సన్మానించారు.
జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ రైతులు 'రైతు నేస్తం' కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని సూచించారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలందించిన రైతులు, వ్యవసాయ అధికారులను జ్ఞాపికలతో సత్కరించారు.
కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అంజిప్రసాద్, ఉద్యానవన శాఖ అధికారి రమణ, పీఏసీఎస్ చైర్మన్ కృష్ణప్రసాద్ రెడ్డి, తహశీల్దార్ సంతోష్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.












