మిర్యాలగూడ, జూలై 27
నల్గొండ జిల్లా కేంద్రంలో నవంబర్ లో జరగనున్న జాతీయ రైతు మహాసభలను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే, రైతు సంఘం జాతీయ నాయకులు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. అన్నారం గ్రామంలో రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్న ఆయన, ప్రభుత్వాలు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమయ్యాయని విమర్శించారు.
నల్గొండ జిల్లా కేంద్రంలో నవంబర్ నెలలో మొట్టమొదటిసారిగా జాతీయ రైతు మహాసభలు జరగనున్నాయని, వాటిని విజయవంతం చేయడానికి రైతాంగం ఆర్థిక, హార్దిక సహాయాలను అందించాలని మాజీ ఎమ్మెల్యే, రైతు సంఘం జాతీయ నాయకులు, మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి కోరారు.
సోమవారం మిర్యాలగూడ మండలం అన్నారం గ్రామంలో పొలాల్లో నాట్లు వేస్తున్న రైతాంగం వద్దకు వెళ్లి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా గ్రామంలోని రైతాంగాన్ని కలిసి మహాసభలకు ఆర్థికంగా సహాయం చేయాలని కోరారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆరు గాలాలు కష్టించి పనిచేసిన రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా రైతులకు కల్లబొల్లి మాటలు చెప్పి, రైతును రాజు చేస్తామని ప్రకటనలు చేయడం తప్ప వారికి చేసింది ఏమీ లేదన్నారు. రుణమాఫీ చేస్తామని చెప్పే పార్టీలు అధికారంలోకి వచ్చాక దాని గురించి ప్రస్తావించకుండా వాగ్దానాలను విస్మరిస్తాయని విమర్శించారు.
వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇస్తామని మాట ఇచ్చి, దాని అమలులో అనేక సందేహాలు వ్యక్తం చేస్తూ మాట తప్పే ఆలోచన చేస్తున్నారని, దీన్ని రైతాంగం సహించబోదని వారు హెచ్చరించారు. రైతు లేనిదే అభివృద్ధి జరగదని, వారిని బుజ్జగిస్తున్నారే తప్ప, వారికి పెన్షన్ గానీ, భరోసా సౌకర్యాలు గానీ కల్పించకపోవడం శోచనీయమన్నారు.
రైతులు ఎదుర్కొంటున్న ఇలాంటి సమస్యలపై జాతీయ స్థాయిలో జరిగే మహాసభలో చర్చించి, పలు తీర్మానాలు చేసి, సమరశీల పోరాటాలకు సమాయత్తం చేయనున్నట్టు తెలిపారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగిన నలగొండ జిల్లాలో మహాసభలు జరపాలనే ఆలోచన జాతీయ రైతు సంఘానికి ఉందని, మొట్టమొదటిసారిగా నల్గొండలో జాతీయ మహాసభల సందర్భంగా రైతులు తమకు తోచిన విధంగా సహకరించి, మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.
కార్యక్రమంలో సిపిఎం నాయకులు డబ్బుకార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి వీరేపల్లి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు మంగారెడ్డి, మండల కార్యదర్శి ఎం.రవి నాయక్, నాయకులు అప్పారావు, అన్నారం గ్రామంలో కాంతారెడ్డి, ఉమాకాంత్ రెడ్డి, వెంకట్ రెడ్డి, కోటిరెడ్డి, బెనర్జీ, కన్యా నాయక్, రైతులు మహాసభల విజయానికి సహకరించాలని కోరారు.












