ఖానాపూర్, జూలై 27
ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ హైదరాబాద్ సచివాలయంలో రాష్ట్ర అటవీ శాఖ చీఫ్ సెక్రటరీ అహ్మద్ నదీమ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అటవీ శాఖ అధికారుల వేధింపులు, అనవసర ఆంక్షలను అరికట్టాలని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, రోడ్ల అభివృద్ధి పనులు, ఇసుక రీచ్‌ల నిర్వహణకు ఆటంకాలు తొలగించాలని ఆయన కోరారు.
ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ హైదరాబాద్ సచివాలయంలో రాష్ట్ర అటవీ శాఖ చీఫ్ సెక్రటరీ అహ్మద్ నదీమ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అటవీ శాఖ అధికారుల వేధింపులు, అనవసర ఆంక్షలను అరికట్టి నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. టైగర్ రిజర్వ్ పరిధిలోని మండలాల్లో ఎకో సెన్సిటివ్ జోన్ (ESZ) అంశంపై ప్రజల్లో నెలకొన్న సందేహాలు, అపోహలను నివృత్తి చేసేందుకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, రోడ్ల అభివృద్ధి పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగేందుకు సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
రెవెన్యూ డివిజన్ పరిధిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌ల నిర్వహణకు అటవీ శాఖ నుంచి అనవసర అడ్డంకులు లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లారు.
ఖానాపూర్ నియోజకవర్గ ప్రజల హక్కులు, అభివృద్ధి కార్యక్రమాల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.











