బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, రైతులు పండించిన తడిసిన ప్రతి జొన్న గింజను ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కొనుగోలు పరిమితిని పెంచాల్సిన ప్రభుత్వం తగ్గిస్తూ కొనుగోలు చేయడం రైతుల పట్ల నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమని విమర్శించారు.
బోథ్ మండలంలోని ధన్నూర్ గ్రామంలో జొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రభుత్వం సరైన సమయంలో కొనుగోలు ప్రక్రియ ప్రారంభించి ఉంటే వందల క్వింటాళ్ల జొన్నలు వర్షానికి తడిసి నష్టపోయేవి కావని ఆయన పేర్కొన్నారు. తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.
ఎకరాకు కనీసం 20 క్వింటాళ్ల జొన్నలను కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఇటీవల బోథ్ నియోజకవర్గంలో ప్రమాదవశాత్తు పంటలు కాలిపోవడంతో నష్టపోయిన రైతులకు ప్రత్యేక ప్యాకేజీ ద్వారా త్వరితగతిన నష్టపరిహారం అందించాలని కూడా కోరారు.
నియోజకవర్గంలోని అన్ని జొన్న కొనుగోలు కేంద్రాలు ఈ రోజు నుంచే ప్రారంభమవుతున్నాయని రైతులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.











