తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన తరగతుల (బీసీ) కులాల పేర్లలో మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. సమాజంలో కించపరిచే విధంగా ఉన్న కొన్ని కులాల పేర్లను తొలగించి, వాటి స్థానంలో గౌరవప్రదమైన పేర్లను చేర్చడానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా ఈ మార్పులు జరుగుతున్నాయి.
రాష్ట్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం ఆయా బీసీ వర్గాల ఆత్మగౌరవాన్ని పెంచుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మార్పులు రాష్ట్ర గెజిట్ ద్వారా అధికారిక రికార్డుల్లోకి తక్షణమే చేరనున్నాయి. ముఖ్యంగా బీసీ గ్రూప్-ఏ విభాగంలో 'దొమ్మర' పేరును 'గడ వంశీయ'గా, 'పిచ్చకుంట్ల'ను 'వంశ రాజ్'గా, 'బుడబుక్కల'ను 'శివ క్షత్రియ'గా మార్చారు. 'వన్నార్' స్థానంలో 'ధోబీ'ని ఖరారు చేశారు.
బీసీ గ్రూప్-డిలో వివాదాస్పదంగా ఉన్న 'శూద్ర కులం' అనే పదాన్ని తొలగించి, 'తమ్మలి (బ్రాహ్మణేతర)'గా పేరు మార్చారు. ఇది ఆ వర్గానికి స్పష్టమైన సామాజిక గుర్తింపును అందిస్తుందని భావిస్తున్నారు. అలాగే, ‘మేర’, ‘చిప్పోలు‘ కులాలకు 'మేరు' అనే పదాన్ని అదనంగా చేర్చారు.
ఈ సంస్కరణల వల్ల భవిష్యత్తులో విద్యార్థులు, ఉద్యోగార్థులు తమ కుల ధ్రువీకరణ పత్రాలలో గౌరవప్రదమైన పేర్లను పొందే అవకాశం ఉంటుంది. సమాజంలో పిలిచేటప్పుడు కలిగే ఇబ్బందులను తొలగించి, ఆత్మవిశ్వాసాన్ని నింపడమే దీని ముఖ్య ఉద్దేశమని బీసీ కమిషన్ తెలిపింది. బీసీ సంఘాలు ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నాయి.











