భైంసా మండలంలోని సుంక్లీ గ్రామంలో “99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా సంతానోత్పత్తి, పశు ఆరోగ్య శిబిరం, దాణా విత్తనాల పంపిణీ, దూడల ర్యాలీ కార్యక్రమాలు శుక్రవారం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఆది రత్న సత్యనారాయణ ఈ కార్యక్రమాలను ప్రారంభించారు.
సర్పంచ్ ఆది రత్న సత్యనారాయణ మాట్లాడుతూ, పశుసంవర్ధక రంగం గ్రామీణ ఆర్థికాభివృద్ధికి కీలకమని, ప్రభుత్వం అందిస్తున్న పశు ఆరోగ్య సేవలను రైతులు, గొర్రెల కాపరులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పశువులకు సరైన టీకాలు, పోషకాహారం అందించడం ద్వారా దిగుబడులు మెరుగుపడతాయని తెలిపారు.
భైంసా ఏఎంసీ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్ ఈ సందర్భంగా రైతులకు దాణా విత్తనాలను పంపిణీ చేశారు. వ్యవసాయంతో పాటు పశుసంపదను అభివృద్ధి చేసుకోవడం ద్వారా రైతులు ఆర్థికంగా బలోపేతం కావచ్చని ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమంలో భాగంగా గ్రామంలో దూడల ర్యాలీ నిర్వహించి, పశు సంరక్షణపై అవగాహన కల్పించారు. ఈ ర్యాలీలో వివిధ రకాల దూడలను ప్రదర్శించి, వాటి పోషణ, ఆరోగ్యం గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలో రైతులు, గొర్రెల కాపరులు, పశుసంవర్ధక శాఖ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. శిబిరం ద్వారా పలువురు రైతులు తమ పశువులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలపై సలహాలు, సూచనలు పొందారు.











