భోరజ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 24
భూగర్భ జలాల మట్టాన్ని పెంచడమే జలసిరి కార్యక్రమం ప్రధాన లక్ష్యమని భోరజ్ మండల వ్యవసాయ శాఖ అధికారి మహమ్మద్ అష్రఫ్ అహ్మద్ తెలిపారు. రాంపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన జలసిరి గ్రామసభలో ఆయన మాట్లాడుతూ, వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకించి భవిష్యత్ అవసరాలకు వినియోగించుకోవాలని సూచించారు.
భూగర్భ జలాల మట్టాన్ని పెంచడమే జలసిరి కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని భోరజ్ మండల వ్యవసాయ శాఖ అధికారి మహమ్మద్ అష్రఫ్ అహ్మద్ అన్నారు. శుక్రవారం రాంపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన జలసిరి గ్రామసభలో ఆయన మాట్లాడారు.
వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం లభ్యమవుతున్న వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకించి, భవిష్యత్ అవసరాలకు వినియోగించేలా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. వీబీ రాంజీ పథకం ద్వారా రైతులు, మహిళా సంఘాలు ఫార్మ్పాండ్లు, ఇంకుడు గుంతలు నిర్మించుకునేందుకు ముందుకు వస్తే ఉపాధి హామీ పథకం ద్వారా ఉచితంగా నిర్మిస్తామని తెలిపారు.
ఈ ఏడాది తక్కువ వర్షపాతం ఉండే అవకాశాల నేపథ్యంలో రైతులు అరుతడి పంటలను సాగు చేయాలని, పంటల తెగుళ్ల నివారణపై అవసరమైన అవగాహన కల్పించారు.
ఎంపీడీవో నర్సింగ్‌రావు మాట్లాడుతూ గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ గృహాలు, సంఘ భవనాల పనులను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.
ఎంపీవో రమేష్ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం డ్రై డే పాటించి నిల్వ నీటిని తొలగించడం ద్వారా మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులను నివారించవచ్చని గ్రామస్తులకు సూచించారు.
ఐకేపీ ఏపీఎం మాధవ్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలు ఫార్మ్పాండ్లు, ఇంకుడు గుంతల నిర్మాణానికి ముందుకు వస్తే ఉపాధి హామీ ద్వారా సహాయం అందిస్తామని తెలిపారు. అలాగే బ్యాంకు రుణాలతో సెంట్రింగ్ యూనిట్లు, ఇటుకల తయారీ వంటి ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. మునగ సాగు చేపట్టే రైతులకు మూడేళ్లపాటు అవసరమైన ఆర్థిక సహాయం అందుతుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి సునీత, గ్రామ సంఘం అధ్యక్షురాలు, మహిళా సంఘాల సభ్యులు, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.












