రంగారెడ్డి, జూలై 18
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని బహదూర్‌గూడలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం భూములను సేకరించే విషయంలో ఉద్రిక్తత నెలకొంది. అధికారులు కంచె వేయడానికి ప్రయత్నించగా స్థానిక రైతులు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. గత ఎనిమిది రోజులుగా రైతులు తమ భూములను ఇచ్చేందుకు నిరాకరిస్తూ ఆందోళనలు చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని బహదూర్‌గూడలో శనివారం ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం సేకరించిన స్థలంలో కంచె వేసేందుకు రెవెన్యూ, హైడ్రా అధికారులు వెళ్లగా స్థానికులు అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
బుల్లెట్ ట్రైన్ కోసం స్థానిక రైతులు తమ భూములను ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. ఈ క్రమంలో గత ఎనిమిది రోజులుగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. తాము భూములు ఇవ్వాలంటే స్పష్టమైన హామీలు, తగిన పరిహారం ప్రకటించాలని, ఆ తరువాతనే తమ భూములు ఇస్తామని రైతులు పేర్కొంటున్నారు.
అయితే, శనివారం ఉదయం హైడ్రా, రెవెన్యూ శాఖల అధికారులు బహదూర్ గూడలోని రైతుల భూముల వద్దకు రావడంతో రైతులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, స్థానికులకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఈ క్రమంలో ఓ రైతు స్పృహతప్పి పడిపోవడంతో అతన్ని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా, తోటి రైతులు అడ్డుకున్నారు. తమకు న్యాయం చేశాకే తమ పొలాల వద్ద కంచె వేయాలని స్థానికులు, రైతులు డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో గ్రామంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం అధికారులు రైతులతో చర్చలు జరిపే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అయితే, తమ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు వెనక్కి తగ్గేది లేదని రైతులు స్పష్టం చేస్తున్నారు.












