Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 17
జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, నీటి లభ్యతకు అనుగుణంగా పంటల సాగు ప్రణాళిక రూపొందించుకోవాలని కలెక్టర్ భవేష్ మిశ్రా రైతులకు సూచించారు. ఎల్నీనో ప్రభావంతో ఈ జూలైలో 30 శాతం లోటు వర్షపాతం నమోదైందని, సోన్ మండలంలో ఇది 50 శాతానికి చేరిందని తెలిపారు.
జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు నీటి లభ్యతకు అనుగుణంగా పంటల సాగు ప్రణాళిక రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
జిల్లాలో ఎల్నీనో ప్రభావంతో జూలై నెలలో సుమారు 30 శాతం లోటు వర్షపాతం నమోదైందని, సోన్ మండలంలో 50 శాతం వరకు వర్షాభావం ఉందని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 4.30 లక్షల ఎకరాల్లో పంటల సాగు కొనసాగుతోందని కలెక్టర్ పేర్కొన్నారు.
నీటి లభ్యతను అంచనా వేసిన తర్వాతే వరి నాట్లు వేయాలని, సాగునీరు పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో వరికి బదులుగా కంది, నూనె తాటి, కూరగాయలు తదితర ఉద్యాన పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. బిందు సేద్యం ద్వారా తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించవచ్చని, ప్రభుత్వ రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
రైతులకు సాంకేతిక సూచనలు అందించేందుకు 89777 51785 సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
భూగర్భ జలాల పరిరక్షణ కోసం ప్రభుత్వం 'తెలంగాణ జలసిరి' కార్యక్రమాన్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి పొలానికి వ్యవసాయ నీటి నిల్వ గుంట ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. వర్షపు నీటిని నిల్వ చేయడం ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయని వివరించారు.
ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమం గడువును ఆగస్టు 3 వరకు పొడిగించినట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 81 శాతం ప్రక్రియ పూర్తయిందని, మిగిలిన పనులను నిర్ణీత గడువులో పూర్తి చేస్తామని చెప్పారు.
విలేకరుల సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్, ఉద్యానవన శాఖ అధికారి రమణ, జిల్లా పౌరసంబంధాల అధికారి విష్ణువర్ధన్తో పాటు పలువురు అధికారులు, విలేకరులు పాల్గొన్నారు.












