ములుగు, జూలై 03
స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్లు గడుస్తున్నా ములుగు జిల్లాలోని అనేక ఆదివాసీ గ్రామాలకు కనీస రోడ్డు, వంతెన సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. నిత్యవసరాల కోసం, వైద్యం కోసం ప్రాణాలను పణంగా పెట్టి వాగులు దాటాల్సిన దుస్థితి నెలకొంది.
వానాకాలం వచ్చిందంటే చాలు వంతెనలు లేని ఆదివాసుల గ్రామాలు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండవలసి పరిస్థితి నెలకొంటుంది. స్వతంత్రం వచ్చి 77 ఏండ్లు గడుస్తున్నా గిరిజన గ్రామాలకు కనీస రోడ్డు సౌకర్యం లేక అవస్థలు పడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామాలకు రోడ్లు, వంతెనలు నిర్మించాలని అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎండాకాలం మాట ఎలా ఉన్నా వానకాలం వచ్చిందంటే చాలు ములుగు, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం వంటి మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసులకు కష్టాలు మొదలవుతాయి. ముఖ్యంగా ములుగు జిల్లా వెంకటాపురం మండలం తిప్పాపురం గ్రామపంచాయతీ పరిధిలోని ఆదివాసీ గ్రామ ప్రజల పరిస్థితి వర్ణనాతీతంగా మారుతోంది. నిత్యవసర సరుకులు తెచ్చుకోవాలన్నా, అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లాలన్నా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వాగు దాటాల్సిన దుస్థితి నెలకొంది.
చుట్టూ అడవి, మరోవైపు ఉధృతంగా ప్రవహించే వాగుల మధ్య ఉన్న గ్రామాలు వర్షాకాలంలో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి ఒక ద్వీపంగా మారుతోంది. ములుగు జిల్లా కలిపాక గ్రామ సరిహద్దుల్లో ప్రవహించే జిన్నెల వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ, పొట్టకూటి కోసం, నిత్యవసరాల కోసం మహిళలు, గ్రామస్థులు దాటక తప్పడం లేదు.
అనారోగ్యం బారిన పడిన గిరిజన మహిళలు, పురుషులు ఒకరినొకరు గట్టిగా పట్టుకుంటూ మానవహారంగా గొలుసుకట్టుగా మారి ప్రాణాలకు తెగించి ఈ వాగును దాటుతున్నారు. ఒక్క అడుగు తప్పటడుగు పడినా వరద ప్రవాహంలో కొట్టుకుపోయే ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ, వేరే మార్గం లేక ప్రతిరోజూ ఇలాంటి ప్రమాదకర ప్రయాణాలు చేయాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వర్షాకాలం మొత్తం ఇదే పరిస్థితి కొనసాగుతుందని, అనారోగ్యం బారిన పడితే ఆసుపత్రికి వెళ్లలేక నరకయాతన అనుభవిస్తున్నామని ఆదివాసీ ప్రజలు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, జిల్లా అధికారులు స్పందించి కనీసం ఈ వర్షాకాలం సీజన్ ముగిసే వరకైనా ప్రయాణానికి ఒక పడవ అందుబాటులో ఉంచాలని వేడుకుంటున్నారు. అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడుకోవడానికి ఈ బోటు ఎంతగానో ఉపయోగపడుతుందని, తమ కష్టాలను గుర్తించి ప్రభుత్వం తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని ములుగు జిల్లా గిరిజన గ్రామస్తులు కోరుతున్నారు.












