కుభీర్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 09
నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో తేజస్వి కంపెనీకి చెందిన సోయా విత్తనాలు మొలకెత్తకపోవడంతో తీవ్రంగా నష్టపోయిన రైతులు గురువారం మండల కేంద్రంలో ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని, నష్టాన్ని భర్తీ చేయాలని కోరుతూ రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ ఆందోళనతో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో తేజస్వి కంపెనీకి చెందిన సోయా విత్తనాలు మొలకెత్తకపోవడంతో తీవ్రంగా నష్టపోయిన రైతులు గురువారం కుభీర్ మండల కేంద్రంలో ఆందోళనకు దిగారు. "మాకు న్యాయం చేయాలి.. నష్టాన్ని భర్తీ చేయాలి" అంటూ వివేకానంద చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ ఆందోళనతో రోడ్డు కిరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో కొంతసేపు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఇటీవల కొనుగోలు చేసిన తేజస్వి కంపెనీ సోయా విత్తనాలు పెద్దఎత్తున మొలకెత్తకపోవడంతో సాగుపై పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి విత్తనాలు కొనుగోలు చేసిన తమ పరిస్థితిని ఎవరు పట్టించుకోవడం లేదని, కంపెనీ నిర్లక్ష్యం కారణంగా భారీ నష్టం వాటిల్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాగులు ఇస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో బ్యాగులు తమకు అవసరంలేదని, వాతావరణ పరిస్థితులు సరిగా లేవని నష్టపరిహారం అందించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సమయంలో కుభీర్ మేజర్ గ్రామపంచాయతీలో జరుగుతున్న సర్ కార్యక్రమాన్ని పరిశీలించి తిరిగి వెళ్తున్న జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా వాహనాన్ని రైతులు అడ్డుకుని తమ సమస్యను వివరించారు. రైతుల గోడును ఓపికగా విన్న కలెక్టర్ సంబంధిత వ్యవసాయ అధికారులతో మాట్లాడి వెంటనే రైతులకు న్యాయం చేయాలని ఆదేశించారు. నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అంతేకాకుండా, అవసరమైన మేరకు బాధిత రైతులకు ప్రత్యామ్నాయంగా సోయా విత్తనాల బ్యాగులు లేదా ఇతర వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడే ఎరువులు అందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
సర్ (ఎస్ఐఆర్) ఫారాల డిజిటలీకరణ ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. గురువారం కుబీర్ మండల కేంద్రంలో సర్ ప్రక్రియను పరిశీలించిన ఆయన, ప్రతి ఓటరికి ఫారాలు అందించి ఎలాంటి తప్పులు లేకుండా నింపించి సంబంధిత బీఎల్వోలకు అప్పగించేలా మండల సూపర్వైజర్లకు సూచించారు. ఓటర్ల నుంచి అందిన ఫారాలను వెంటనే డిజిటలీకరణ చేసి గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా ఓ ఇంటిని సందర్శించి సర్ ప్రక్రియను పరిశీలించారు. ప్రతి ఇంటికీ వెళ్లి ఫారాల సేకరణ, డిజిటలీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని బీఎల్వోలకు సూచించారు.












