యూరియా పంపిణీకి అమలు చేస్తున్న యాప్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నందిపేట మండల కేంద్రంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులు భారీ ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనలో సుమారు 500 మంది రైతులు పాల్గొన్నారు.
డొంకేశ్వరం, నందిపేట మండలాలకు చెందిన రైతులు పార్టీలకు అతీతంగా ఈ ఆందోళనలో పాల్గొని, యాప్ విధానం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు. మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఎన్. శ్రీనివాస్‌రెడ్డి, నక్కల భూమేష్, మచర్ల సాగర్, బాల్ గంగాధర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మాజీ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న యూరియా యాప్ రైతులకు ఇబ్బందికరంగా మారిందని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి రైతు వద్ద స్మార్ట్‌ఫోన్ లేదని, కొంతమందికి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేదని అన్నారు. యాప్ ద్వారా ఎరువుల బుకింగ్ విధానం రైతులకు మరిన్ని సమస్యలు సృష్టిస్తోందని ఆరోపించారు.
కొనుగోలు కేంద్రాల నిర్వహణలో లోపాలు, పంటల కొనుగోలు ఆలస్యం కారణంగా రైతులు నష్టపోతున్నారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా యాప్‌ను వెంటనే రద్దు చేసి, రైతులకు నేరుగా ఎరువులు అందించే విధానాన్ని పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం రైతులు తమ సమస్యలను వివరిస్తూ తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.
రైతుల ఆందోళన కారణంగా వాహనాల రాకపోకలకు సుమారు రెండు గంటల పాటు అంతరాయం ఏర్పడింది. సంఘటనా స్థలానికి చేరుకున్న తహసీల్దార్ రైతులను సముదాయించి, నచ్చజెప్పి ధర్నా విరమింపజేశారు.












