మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 04
టీచర్స్ డే సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ ఈపూరి రాజారత్నం తన గురువులకు అక్షర సుమాంజలి ఘటించారు. తన జీవితాన్ని తీర్చిదిద్దిన ఐదుగురు గురువుల సేవలను ఆయన స్మరించుకున్నారు. కన్నతల్లిలా ప్రేమను పంచుతూ, ఆట పాటల ద్వారా విద్యాబుద్ధులు నేర్పిన టీచర్ల రుణం తీర్చుకోలేనిదని ఆయన పేర్కొన్నారు.
మా అక్షర దేవతలారా....మీకు పాదాభివందనం. అమ్మలారా తీర్చుకోలేని రుణం తల్లీ మీది. టీచర్స్ డే సందర్భంగా మా అక్షర దైవాలకు ఈ అక్షర సుమాంజలి. అమ్మలారా...మీ వద్ద అక్షరం నేర్చిన ఋణంతో అదే అక్షరాలను మీ ముందు సాగిలపరుస్తూ....మీ కోసం ఈ రోజు.
బుడి బుడి నడకలతో, పాలబుగ్గల చిన్నారులుగా బడి బాట పట్టి అక్షరాలు దిద్దేందుకు మీ వద్దకు వచ్చిన మమ్మల్ని విద్యావేత్తలుగా, పలు రంగాలలో నిష్ణాతులుగా తీర్చిదిద్దిన మా అక్షర దేవతలు మీరు. కన్నతల్లిలా ప్రేమను పంచుతూ, ఆట పాటల ద్వారా విద్యాబుద్ధులు నేర్పిన అమ్మలాంటి మా టీచరమ్మల రుణం తీర్చుకోలేనిది. గుండెల నిండా మా సరస్వతీ తల్లులపై అభిమానం, రుణపడి ఉన్న జీవితాలతో మా డాన్ బోస్కో అక్షర దేవతలకు పాదాభివందనాలతో ఈ కథనం మా టీచర్ గార్లకు అంకితం.
నా అక్షరాలకు...5 గురు అమ్మలు.
అమ్మ సరోజనమ్మ: ఈ అమ్మ మనసు చల్లన, వెన్నలాంటి మంచి మనసు. బుడి బుడి నడకల బుడతలకు, అల్లరి పిల్లలకు, నిత్యం అమ్మ కావాలి అంటూ మారాం చేసే చిన్నారులను కన్నతల్లి కన్నా ఎక్కువగా దగ్గరకు తీసుకుని ఆట-పాటలతో అ ఆ..., ఇ ఈ..., ఉ ఊ... అంటూ చిట్టి చేతులను పట్టి అక్షరాలు దిద్దించి, బొమ్మలతో పదాలు పలికించి మా అక్షర కథనాలకు అక్షర శ్రీకారం చుట్టిన మా అమ్మ సరోజనమ్మ మీరు మా మధ్య లేరు అన్న భావన ఉన్నప్పటికీ మీరు మాకు నేర్పిన అక్షరాలు తమరిని ఎప్పుడూ మా కళ్ళ ముందే ఉంచుతున్నాయమ్మ. ఈ రోజు మీకు ఓ పాదాభి వందనం. అలాగే మీరు నేర్పిన అక్షరాలతోనే మీకు నేడు మా అక్షర నీరాజనం.
నాగ మల్లేశ్వరమ్మ: అమ్మా...మీకు మా అక్షర సుమాంజలి. సరోజనమ్మ అక్షరాలు నేర్పితే అదే ప్రేమను పంచుతూ...గుణింతాల ఆధారంగా తెలుగు పదాలు, పదాల నిర్మాణం నేర్పి వాక్య నిర్మాణాలకు అవసరమైన అర్ధవంతమైన పదాలు మాకు నేర్పించటంలో మీకు మీరే సాటి అమ్మ. తెలుగు భాషలో బలమైన, పదునైన, సున్నితమైన ఏ విధమైన పదాలు మేము పలికినా, రాసినా... అంతా మీ ద్వారానే మాకు సాధ్యపడింది తల్లీ. అమ్మా మీకు కూడా నేడు మా అక్షర సుమాంజలి.
ఇన్యాసమ్మ: అమ్మా...మా అక్షర దైవాలుగా మీకు ప్రత్యేక నమస్సులు. అమ్మా సరోజనమ్మ దిద్దించిన అక్షరాలు, నాగమల్లేశ్వరమ్మ నేర్పిన తెలుగు పదాలు రెండింటిని కలిపి మేము వాక్య నిర్మాణాలు. ఒక వాక్యం ప్రారంభం నుండి ఎక్కడ ఆ వాక్యానికి కామాలు, ఫుల్ స్టాప్ పెట్టాలి అనేది నేర్పించి ఎంతో మంది విద్యార్థులకు తెలుగు భాషలో వాక్య నిర్మాణం అంటే ఏమిటి... అనేది మాకు నేర్పించిన మీరు సరోజనమ్మ, నాగమల్లేశ్వరమ్మలను మించిన ఘనమైన అమ్మా. ఇన్యాసమ్మ మీకు కూడా ఈ రోజు మా మొదటి ఇద్దరమ్మల సమక్షంలో అక్షర వందనాలు. ఎందుకంటే మాతో ఉపాధ్యాయులే జాతి నిర్మాతలు అనేటువంటి వాక్యాల నిర్మాణం చేయించిన నిజమైన జాతి నిర్మాతలు మీరే తల్లి. ఈ రోజు మీకు కూడా మా నుండి పాదాభివందనం అమ్మ.












