మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 29
నిర్మల్ జిల్లా: 110 ఏళ్ల నాటి శిథిల భవనంలో ముదోల్ తహసీల్దార్ కార్యాలయం కొనసాగుతుండటంపై బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని బీఎస్పీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ జగన్ మోహన్ విమర్శించారు. వెంటనే నూతన భవనం నిర్మించాలని, లేదంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు.
నిజాం సర్కారు కాలంలో నిర్మించి, 110 ఏళ్లుగా శిథిలావస్థకు చేరుకున్న భవనంలోనే ముదోల్ తహసీల్దార్ కార్యాలయం కొనసాగుతుండటం రాష్ట్ర ప్రభుత్వ ఘోర నిర్లక్ష్యానికి నిదర్శనమని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నిర్మల్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ జగన్ మోహన్ తీవ్రంగా విమర్శించారు. 1956 భాషా ప్రాతిపదికన రాష్ట్రాల విభజనలో నాందేడ్ జిల్లా నుంచి, 2014 తెలంగాణ ఏర్పాటు తర్వాత 2016 నుంచి ఈ కార్యాలయం నిర్మల్ జిల్లాలో కొనసాగుతోందని ఆయన తెలిపారు.
ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని, ఎప్పుడు కూలిపోతుందో తెలియని భవనంలో కార్యాలయాన్ని నిర్వహించడం ప్రమాదకరమని జగన్ మోహన్ అన్నారు. ప్రతిరోజూ వందలాది మంది రైతులు, మహిళలు, విద్యార్థులు, వృద్ధులు, కార్యాలయ ఉద్యోగులు ఈ కార్యాలయానికి వస్తున్నారని, చిన్న ప్రమాదం జరిగినా భారీ ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజల నుంచి పన్నులు వసూలు చేసే ప్రభుత్వం, కనీస భద్రత కలిగిన కార్యాలయ భవనాన్ని కూడా కల్పించలేకపోవడం పాలనా వైఫల్యమని మండిపడ్డారు.
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనూ ముదోల్ నియోజకవర్గం నిర్లక్ష్యానికి గురైందని, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో కోట్లాది రూపాయల హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు.
వెంటనే ముదోల్ తహసీల్దార్ కార్యాలయానికి నూతన భవనాన్ని మంజూరు చేయాలని, అప్పటి వరకు కార్యాలయాన్ని సురక్షితమైన ప్రత్యామ్నాయ భవనానికి తరలించాలని బీఎస్పీ డిమాండ్ చేసింది. జిల్లాలోని అన్ని శిథిల ప్రభుత్వ భవనాలపై ప్రత్యేక సర్వే నిర్వహించి తక్షణ చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యానికి బాధ్యులైన అధికారులపై చర్యలు చేపట్టాలని కోరింది.
ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముట్టడి, ధర్నాలు, ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామని అడ్వకేట్ జగన్ మోహన్ హెచ్చరించారు. ప్రజల ప్రాణాలతో నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రభుత్వాన్ని బీఎస్పీ ఉపేక్షించదని, వెంటనే తహసీల్దార్ కార్యాలయం నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ జగన్ మోహన్, నియోజకవర్గం అధ్యక్షులు వాగ్మారే విలాస్, జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీ యాదవ్, నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి చాకటి నిఖిల్, దగ్డే అంబదాస్, పార్టీ సీనియర్ నాయకులు సింగారే సునీల్, వాగ్మారే సుదర్శన్, దగ్డే కరణ్, బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు.











