Palnadu/Amaravathi (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 29
థాయిలాండ్‌లో ఒక మహిళ తన భర్తను నెలవారీ లీజుకు ఇచ్చేందుకు సిద్ధపడింది. ప్రియురాలితో కలిసి ఉండాలనుకున్న భర్తకు, ప్రతి నెలా రూ. 85,000 చెల్లిస్తే అతడిని మీతోనే ఉంచుకోవచ్చని ఆఫర్ ఇచ్చింది. ఈ వింత ఘటన అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
ఇల్లు, కార్లు, బైకులు అద్దెకు లేదా లీజుకు ఇవ్వడం సాధారణమే. కానీ, కట్టుకున్న భర్తను లీజుకు ఇచ్చిన వింత ఘటన థాయిలాండ్‌లో వెలుగులోకి వచ్చింది. ప్రియురాలితో కలిసి ఉండాలనుకున్న భర్తకు, కోపంతో కాకుండా ఊహించని 'మాస్టర్ ప్లాన్'తో షాకిచ్చింది ఈ భార్య. నెలకు రూ. 85,000 చెల్లిస్తే నా భర్తను నీతోనే ఉంచుకో అని ఆ ప్రియురాలికే ఆఫర్ ఇచ్చింది. అంతర్జాతీయంగా నెటిజన్లను షాక్‌కు గురిచేస్తున్న ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
థాయిలాండ్‌కు చెందిన ఖున్ క్వాంగ్ (31) అనే మహిళ, పదేళ్ల క్రితం ఒక పోలీస్ అధికారిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి 8 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. చాలాకాలం పాటు వీరి కాపురం సంతోషంగా సాగింది. ఇటీవల భర్త ప్రవర్తనలో మార్పు గమనించిన క్వాంగ్‌కు అనుమానం వచ్చింది. ఆరా తీయగా, ఒక అపరిచిత మహిళ సోషల్ మీడియాలో తన భర్తను నిరంతరం ఫాలో అవుతున్నట్లు తెలిసింది. అసలు నిజం తెలుసుకోవడానికి ఆమె ఒక ప్రైవేట్ డిటెక్టివ్‌ను నియమించింది. విచారణలో తన భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని, ఆమెతో కలిసి ఒక అపార్ట్మెంట్లో నివసిస్తున్నట్లు డిటెక్టివ్ ఆధారాలతో సహా బయటపెట్టాడు.
ఈ విషయం బయటపడిన వెంటనే ఆ భర్త ఇంటికి వచ్చి, భార్యకు ఊహించని షాక్ ఇచ్చాడు. 'నాకు ఈ సంసారం వద్దు.. ఇల్లు, కారు, అప్పులు అన్నీ నీకే ఇచ్చేస్తున్నా.. నేను ఆమెతోనే ఉంటా' అంటూ కట్టుబట్టలతో వెళ్ళిపోయాడు. అయినా భార్య ఎలాగోలా సర్దిచెప్పి అతడిని ఇంటికి రప్పించింది.
ఒక రోజు రాత్రి భర్త, 'నేను ఆమెను (ప్రియురాలిని) మర్చిపోలేకపోతున్నాను, ఆమె లేకుండా ఉండలేను' అని భార్య ముందే ఆవేదన వ్యక్తం చేశాడు. దాంతో కోపగించుకోకుండా, భార్య క్వాంగ్ ఒక వింతైన ఆలోచన చేసింది. 'నీకు నా భర్త కావాలి, నా భర్తకు నువ్వు కావాలి. కాబట్టి నా భర్తను నీకు అద్దెకు (లీజుకు) ఇస్తాను. కానీ దానికి ప్రతిఫలంగా నెలకు 30,000 థాయ్ బాట్లు (భారతీయ కరెన్సీలో సుమారు రూ.85,000) నాకు చెల్లించాలి. అప్పుడు అతడు నీతోనే ఉండవచ్చు. కానీ నేను చట్టపరంగా విడాకులు మాత్రం ఇవ్వను' అని షరతు విధించింది.
ఈ ఆఫర్ విన్న ప్రియురాలు, 'నాకు డబ్బు సమస్య కాదు, అద్దె కట్టడానికి నేను సిద్ధం' అని తల ఊపింది. కానీ, తనను ఇలా లీజుకు ఇవ్వడం నచ్చక భర్త మాత్రం ఈ అగ్రిమెంట్‌కు నిరాకరించాడు.
ఈ వింత 'హజ్బెండ్ లీజ్ అగ్రిమెంట్' (భర్త అద్దె ఒప్పందం) వార్త థాయిలాండ్ టీవీ షోలు, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో న్యాయ నిపుణులు స్పందించారు. థాయిలాండ్ చట్టాల ప్రకారం ఏకపత్నీవ్రత నిబంధనలు అమలులో ఉన్నందున, డబ్బులు తీసుకుని భర్తను మరొకరికి అద్దెకు ఇచ్చే ఒప్పందాలకు చట్టపరమైన చెల్లుబాటు ఉండదని స్పష్టం చేశారు. చివరికి ఆ భార్య (క్వాంగ్) లీజ్ ప్లాన్ వర్కవుట్ కాకపోవడంతో, తన భర్త ప్రియురాలిపై కోర్టులో కేసు నమోదు చేసింది.












