తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను నిర్మల్లోని వశిష్ట ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని బోనాల పండుగను వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు పోతరాజు, అమ్మవారి వేషధారణలో ఆకట్టుకున్నారు. ముందుగా దుర్గామాత చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు అమ్మవారికి బోనం సమర్పించి ఆటపాటలతో సందడి చేశారు.
సంస్కృతిపై అవగాహన
పాఠశాల చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ అనగానే ప్రతి ఒక్కరికీ గుర్తుకొచ్చేది బోనాల పండుగ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, రాష్ట్రంలోని ప్రతి పల్లెలో ప్రజలు భక్తిశ్రద్ధలతో ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి. మాధవి, ఉపాధ్యాయ బృందం, పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.











