హైదరాబాద్, 2026-08-07
నీట్ ప్రవేశ పరీక్ష లీక్ వ్యవహారం అప్పటికప్పుడు జరిగినది కాదని, ఇది వ్యవస్థీకృతమైన, బహుళ రాష్ట్రాల ప్రమేయం ఉన్న నేరపూరిత కుట్ర ఫలితమని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఆరోపించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నియమించిన సబ్జెక్టు నిపుణులు, కోచింగ్ నిర్వాహకులు, బ్రోకర్లు ఈ కుట్రలో భాగస్వాములయ్యారని సీబీఐ తెలిపింది.
నీట్ ప్రవేశ పరీక్ష లీక్ వ్యవహారం అప్పటికప్పుడు జరిగినది కాదని, ఇది వ్యవస్థీకృతమైన, బహుళ రాష్ట్రాల ప్రమేయం ఉన్న నేరపూరిత కుట్ర ఫలితమని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఆరోపించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నియమించిన సబ్జెక్టు నిపుణులు, కోచింగ్ నిర్వాహకులు, బ్రోకర్లు ఈ కుట్రలో భాగస్వాములయ్యారని సీబీఐ తెలిపింది. ప్రవేశ పరీక్ష చివరి నిమిషంలో జరిగిన చర్య కాదని, కొన్ని నెలల క్రితమే ప్రణాళిక వేసి ప్రశ్నపత్రాలను లీక్ చేశారని సీబీఐ తన ఛార్జిషీట్లో పేర్కొంది.
వ్యవస్థీకృత నేరానికి ఆధారాలు
ఈ కేసులో మొత్తం 13 మంది నిందితులను సీబీఐ అరెస్టు చేసింది. ఎన్టీఏ కేంద్రంలో ప్రశ్నపత్రాలను తయారు చేస్తున్న సమయంలో, ముగ్గురు నిందితులు ప్రశ్నలను కాపీ చేసి వాటిని చీటీలపై రాసుకున్నారని ఛార్జిషీట్ ద్వారా వెల్లడైంది. కొన్ని ప్రశ్నలను నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) పుస్తకాలలోని పేరాగ్రాఫ్లలో మార్క్ చేసినట్లు ఆధారాలు లభించాయి. ఈ ముగ్గురు నిందితులకు ఎన్టీఏలో ప్రశ్నల సెట్టింగ్, అనువాద విభాగాలకు యాక్సెస్ ఉందని ఛార్జిషీట్ ద్వారా తెలిసింది.
డిజిటల్ విధానాలను తప్పించుకున్నారు
ఎన్టీఏ కేంద్రం నుంచి సేకరించిన సమాచారాన్ని నమ్మకమైన వ్యక్తులు, కోచింగ్ సెంటర్ల ద్వారా విద్యార్థులకు చేరేలా చేశారు. అయితే, ఈ ప్రక్రియలో డిజిటల్ విధానాలను వాడకుండా, నిందితులు తమను తాము తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఆర్థికంగా లాభపడేందుకు, ట్యూషన్ విద్యార్థులలో సక్సెస్ రేటును పెంచేందుకు నిందితులు ఈ అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ తన ఛార్జిషీట్లో పేర్కొంది.
హోటల్ గదుల్లో ప్రశ్నల సాధన
ప్రైవేటు కోచింగ్ సెషన్ల సందర్భాల్లో లీక్ చేసిన ప్రశ్నలను విద్యార్థులతో రాయించారని, వాటికి సంబంధించిన ఆధారాలను సేకరించినట్లు కూడా ఛార్జిషీట్లో తెలిపింది. తేలికైన ప్రశ్నలను కంఠస్థం చేసి, ఆ తర్వాత తమ హోటల్ గదులలో వాటిని కాగితంపై రాసుకునేవారని ఛార్జిషీట్లో తెలిపారు. ఎన్టీఏ విధి నిర్వహణలోనూ లోపాలు ఉన్నట్లు గుర్తించారు. ఎన్టీఏ కేంద్రం వద్ద తనిఖీలు కానీ, క్షుణ్ణంగా పరిశీలించడం కానీ సమర్థవంతంగా లేదని గుర్తించారు.
ఏ2 నిందితుడు పీవీ కులకర్ణి పాత్ర
ఈ కేసులో ఏ2 నిందితుడైన పీవీ కులకర్ణి, మూడు సెట్ల ప్రశ్నపత్రాలకు చెందిన అనువాద పనిని కూడా చేశాడు. మూడు రోజుల వ్యవధిలో అతను 135 ప్రశ్నలను అనువదించాడని తన ఛార్జిషీట్లో పేర్కొంది. 13 మంది నిందితుల్లో ముగ్గురు ఎన్టీఏ సబ్జెక్టు నిపుణులు, కోచింగ్ నిర్వాహకులు, మధ్యవర్తులు, లబ్ధి పొందిన విద్యార్థులు ఉన్నారు. ఎన్టీఏలో పనిచేస్తున్న కొందరు తమ అధికారాన్ని వాడుకుని రహస్య సమాచారాన్ని సేకరించినట్లు గుర్తించారు.











