హైదరాబాద్, 2026-08-20
దేశీయ వ్యవసాయ రంగానికి వెన్నెముకగా నిలుస్తున్న మహిళా శ్రామికులకు సరైన గుర్తింపు, వనరులు లభించడం లేదని, దీనివల్ల ప్రతియేటా రూ.2 లక్షల కోట్ల ఉత్పత్తి నష్టం వాటిల్లుతోందని ఆర్య. ఎజి రూపొందించిన హర్ హార్వెస్ట్ నివేదిక వెల్లడించింది. భూమి యాజమాన్యం, వేతనాలు, రుణాల వంటి వ్యవస్థాగత అసమానతలు దీనికి కారణమని నివేదిక పేర్కొంది.
దేశీయ వ్యవసాయ రంగానికి వెన్నెముకగా నిలుస్తూ పగలూ రాత్రి తేడా లేకుండా కష్టపడుతున్న కోట్లాది మంది మహిళా శ్రామికులకు సరైన గుర్తింపు, సమాన వనరులు లభించడం లేదని, దీనివల్ల భారత వ్యవసాయ రంగానికి ప్రతియేటా రూ.2 లక్షల కోట్ల వరకు భారీ ఉత్పత్తి నష్టం వాటిల్లుతోందని ఆర్య. ఎజి రూపొందించిన హర్ హార్వెస్ట్ నివేదిక వెల్లడించింది. మహిళలు ఎదుర్కొంటున్న భూమి యాజమాన్యం, వేతనాలు, రుణాలు, వ్యవసాయ ఇన్పుట్లు, నిల్వ సదుపాయాలు, మార్కెట్ల లభ్యత తదితర వ్యవస్థాగత అసమానతల కారణంగా దేశం భారీ స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోతోందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. క్షేత్రస్థాయి సాగు పనుల్లో పురుషులతో సమానంగా శ్రమిస్తున్నప్పటికీ.. వేతనాలు, భూమి యాజమాన్య హక్కులు, ఆర్థిక వనరుల లభ్యతలో చూపుతున్న తీవ్ర అసమానతల వల్ల భారత వ్యవసాయ రంగానికి ప్రతియేటా 2.5 నుంచి 4 శాతం మేర ఉత్పత్తి నష్టం వాటిల్లుతోందని ఈ నివేదిక సమగ్రంగా విశ్లేషించింది. 2013లో ప్రారంభమైన ఈ అగ్రిటెక్ కంపెనీ, రైతులకు పంట కోత అనంతర నిల్వ వసతులు, ఆర్థిక సాయం, మార్కెట్ లింకేజీలను అందిస్తోంది.
రూ. వంద పనికి రూ.82 మాత్రమే
ప్రస్తుతం దేశంలో గ్రామీణ మహిళా శ్రామిక శక్తిలో ఏకంగా 77 శాతం మంది ఉపాధి కోసం ప్రత్యక్షంగా వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారు. పురుషులు ఉపాధి వేటలో భాగంగా ఇతర రంగాలు, సమీప పట్టణాలకు తరలివెళ్తుండటంతో వ్యవసాయ రంగంలో మహిళల భాగస్వామ్యం 2017-18లో 57 శాతంగా ఉండగా.. అది కాస్తా 2023-24 నాటికి 64 శాతానికి పైగా పెరిగింది. పొలంలో విత్తనం నాటే స్థాయి నుంచి పంట కోతల వరకు సగానికి పైగా క్షేత్రస్థాయి శ్రమలో మహిళలే ముందుంటున్నారు. అయితే వేతనాల విషయానికి వచ్చేసరికి దశాబ్దాలుగా వివక్షే రాజ్యమేలుతోంది. తీవ్ర స్థాయిలో శారీరక శ్రమ చేసినప్పటికీ పురుషులతో పోలిస్తే మహిళా కూలీలకు 20 నుంచి 30 శాతం తక్కువ వేతనం ఇస్తున్నారు. పురుష కూలీలు రోజుకు సగటున రూ.100 ఆర్జిస్తుంటే.. అదే పనికి మహిళలకు కేవలం రూ.82 మాత్రమే అందడం శ్రమ దోపిడీకి అద్దం పడుతోందని నివేదిక పేర్కొంది.
భూమి హక్కులకు 47.7 శాతం మంది దూరం
దేశంలో మొత్తం సాగుభూమిలో మహిళల పేరిట ఉన్నది కేవలం 11.72 శాతం మాత్రమే. అయితే 47.7 శాతం మంది మహిళలు వ్యవసాయ రంగంలో ఉచితంగా పనిచేసే కుటుంబ సహాయకులు గానే పరిగణించబడుతున్నారు. పట్టాదారు పుస్తకాల్లో పేర్లు లేవనే ఒకే ఒక్క సాంకేతిక కారణంతో బ్యాంకులు, ప్రభుత్వ యంత్రాంగం వీరిని అధికారికంగా రైతులుగా అంగీకరించడానికి నిరాకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఆర్థిక మూలధనం లేకపోవడంతో వారు ఆధునిక యంత్రాలు, నాణ్యమైన విత్తనాలు వాడలేక పంట దిగుబడులను కోల్పోతున్నారు. పైగా పంట చేతికి వచ్చాక నిల్వ చేసుకునే ఆర్థిక సామర్థ్యం లేక, దళారులు అడిగిన తక్కువ ధరలకే పంటను అమ్ముకోవాల్సిన దుస్థితి తలెత్తుతోంది.












