ఆర్మూర్, 2026-08-20
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తలారి తిరుపతి (45) మంగళవారం (ఆగస్టు 18, 2026) గుండెపోటుతో మృతి చెందారు. మెట్లు దిగుతుండగా కుప్పకూలిపోయిన ఆయన, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సంతాపం తెలిపారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న తలారి తిరుపతి (45) మంగళవారం (ఆగస్టు 18, 2026) గుండెపోటుతో మృతి చెందారు. మంగళవారం సాయంత్రం మెడికల్ షాప్ నుంచి మందులు తీసుకునేందుకు అపార్ట్మెంట్ మెట్లు దిగుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారని, అప్పటికే ఆయన ఆరోగ్యం విషమించిందని అపార్ట్మెంట్ వాసులు తెలిపారు. దీంతో తలారి తిరుపతి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు ముగ్గురు ఆడపిల్లలే ఉన్నారని, కుటుంబానికి పెద్ద దిక్కు లేకుండా పోయిందని అపార్ట్మెంట్ వాసులు విచారం వ్యక్తం చేస్తున్నారు. గతంలో గుండెపోటు రావడంతో ఆయన వైద్య చికిత్స పొందుతున్నారు.
సీపీ సాయి చైతన్య నివాళులు
హెడ్ కానిస్టేబుల్ తలారి తిరుపతి మృతి పట్ల బుధవారం నిజామాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయి చైతన్య, మృతదేహం వద్ద నివాళులర్పించి, తిరుపతి కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరుపతి నిజాయితీపరుడని, తన విధులను నిబద్ధతతో నిర్వర్తించేవారని కొనియాడారు. పోలీస్ శాఖలో ఆయన సేవలు మరువలేనివని అన్నారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
నర్సింగరావు ప్రశంస
తలారి తిరుపతి మృతి పట్ల బుధవారం నిజామాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయి చైతన్య, మృతదేహం వద్ద నివాళులర్పించి, తిరుపతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేయడాన్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నేషనల్ యూత్ ప్రాజెక్ట్ యునైటెడ్ నేషన్స్ ఆఫ్ యూత్ ఆర్గనైజేషన్ దక్షిణ ఆసియా మైత్రి సదస్సు సెక్రటరీ బి.ఆర్. నర్సింగరావు అభినందించారు. పోలీస్ డిపార్ట్మెంట్లో చిన్న స్థాయి ఉద్యోగి కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలవడం ద్వారా కమిషనర్ ఆఫ్ పోలీస్ తన మానవత్వాన్ని నిరూపించుకున్నారని నర్సింగరావు వివరించారు. ఇలాంటి అధికారులు యువతకు ఆదర్శమని ఆయన పేర్కొన్నారు.
అపారమైన ప్రజాదరణ
ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేసి మృతి చెందిన తలారి తిరుపతికి నిజామాబాద్ జిల్లాతో పాటు జగిత్యాల్, నిర్మల్ జిల్లాల్లోనూ అపారమైన అభిమానం ఉండేది. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, అశేష ప్రజానీకం ఆయనకు నివాళులర్పించడమే దీనికి నిదర్శనం. ఆయన మృతదేహాన్ని సందర్శించి, కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.












