జిల్లాలో రైతుల నుంచి సేకరిస్తున్న ధాన్యం నిల్వలో జాప్యం జరగకుండా ముందస్తుగా అదనపు స్థలాలను సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ, గోదాముల లభ్యత, రవాణా సౌకర్యాలపై ఆయన సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ఈ సమీక్షలో, కొనుగోలు కేంద్రాలకు వస్తున్న ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు లేదా గోదాములకు తరలించాలని కలెక్టర్ సూచించారు.
నిల్వ సామర్థ్యం సరిపోని పక్షంలో ప్రైవేట్ గోదాములు, ఇతర ఖాళీ ప్రదేశాలను గుర్తించి వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని, ధాన్యం సేకరణ వేగవంతం చేసేందుకు అవసరమైన మేర లారీలు, హమాలీల సంఖ్యను పెంచాలని అధికారులను ఆదేశించారు.
కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చే రైతులకు ఎండ తీవ్రత దృష్ట్యా తాగునీరు, నీడ వంటి కనీస వసతులు కల్పించాలని, కేంద్రాల వద్ద భద్రతా చర్యల్లో భాగంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, రాత్రి సమయాల్లో సరిపడా లైటింగ్ సౌకర్యం ఉండేలా చూడాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ధాన్యం తూకంలోనూ, రవాణాలోనూ ఎలాంటి అవకతవకలు జరగకుండా పకడ్బందీగా వ్యవహరించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్, పౌరసరఫరాల అధికారులు రాజేందర్, సుధాకర్, అధికారులు పాల్గొన్నారు.








