తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసే ప్రక్రియను ఈ నెల 17 లేదా 18వ తేదీ నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ వేగవంతం కానుంది.
రాష్ట్ర ఆర్థిక శాఖ రైతు భరోసా పథకానికి అవసరమైన నిధులను సమకూర్చుకున్నట్లు సమాచారం. గత వానాకాలం సీజన్లో 69,39,548 మంది లబ్ధిదారులకు ఎకరాకు రూ.6,000 చొప్పున రూ.8,744.13 కోట్లు చెల్లించారు. ఈసారి కూడా వీరందరికీ సాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధమైంది.
బోగస్ లబ్ధిదారులను గుర్తించేందుకు వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహించిన శాటిలైట్ సర్వే నివేదిక అందింది. అయితే, ఈ సర్వేతో సంబంధం లేకుండా గతంలో లబ్ధి పొందిన వారందరికీ ఈసారి కూడా రైతు భరోసా అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. గత సీజన్లో 1.46 కోట్ల ఎకరాలకు ఈ పథకం వర్తించింది.
యాసంగి సీజన్లో కూడా 1.46 కోట్ల ఎకరాలకు రైతు భరోసా చెల్లింపులు జరగనున్నాయి. దీనికి అవసరమైన నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల RBI నుంచి రూ.9,000 కోట్ల రుణం తీసుకుంది. మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే, అంటే ఫిబ్రవరి 17 లేదా 18 నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బు జమ అయ్యే అవకాశం ఉంది.
కొత్తగా వ్యవసాయ భూములు కొనుగోలు చేసిన వారికి నమోదు ప్రక్రియపై ఇంకా స్పష్టత లేదు. అధికారులు కొత్త దరఖాస్తులను స్వీకరించడం లేదు. ఎప్పటి నుంచి కొత్త దరఖాస్తులు స్వీకరిస్తారు, ఏ తేదీని కటాఫ్‌గా తీసుకుంటారు అనే దానిపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

