నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని కిస్టాపూర్ గ్రామపంచాయతీలో ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న ఫిష్ ఫండ్ పనులను జిల్లా హెచ్ఆర్ మేనేజర్ సుధాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలకు పలు సూచనలు చేశారు.
జిల్లా హెచ్ఆర్ మేనేజర్ సుధాకర్ కిస్టాపూర్ గ్రామపంచాయతీలో జరుగుతున్న ఫిష్ ఫండ్ పనుల పురోగతి, నాణ్యతను సమీక్షించారు. ఎండల తీవ్రత దృష్ట్యా కూలీలు ఉదయం వేళల్లోనే పనులకు హాజరుకావాలని, ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
హాజరు విధానంపై కూలీలకు అవగాహన కల్పించారు. రోజుకు రెండుసార్లు ఫోటో ఆధారిత హాజరు నమోదు తప్పనిసరి అని, పనుల్లో పారదర్శకత, సమయపాలన పాటించాలని సూచించారు. ఫిష్ పాండ్ల వల్ల గ్రామానికి కలిగే ప్రయోజనాలను, ఆదాయ అవకాశాలను వివరించారు.
ఈసీ జాదవ్, అనిల్ (ఇన్చార్జి ఏపీవో) మాట్లాడుతూ, ఎండల తీవ్రత నేపథ్యంలో కూలీలు తాగునీరు ఎక్కువగా వెంట తీసుకువెళ్లాలని, డీహైడ్రేషన్ సమస్యలు రాకుండా ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని తెలిపారు. కూలీల ఆరోగ్యం తమకు ముఖ్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సాంకేతిక సహాయకుడు రవీందర్, క్షేత్ర సహాయకుడు అంబకంటి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఉపాధి కూలీలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వీరి సహకారంతో పనులు సకాలంలో పూర్తవుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.












