దేగాం గ్రామంలో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖానా భవనం ప్రారంభం కాకపోవడంపై స్థానిక సర్పంచ్ సిరం సుష్మరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బిల్లుల వివాదంతో కాంట్రాక్టర్ తాళం వేయడంతో ప్రజలకు అందుబాటులోకి రాని దవాఖానాపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
బైంసా మండలం, దేగాం గ్రామంలో పల్లె దవాఖానా భవనం నిర్మాణం పూర్తయినా, బిల్లుల వివాదంతో కాంట్రాక్టర్ తాళం వేయడంతో ప్రజలకు అందుబాటులోకి రాలేదని సర్పంచ్ సిరం సుష్మరెడ్డి తెలిపారు. ఇది పేద ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ఆటంకంగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
వానల్ పాడ్ గ్రామంలో జరిగిన మండల స్థాయి సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించిన సర్పంచ్, అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని, తక్షణమే దవాఖానాను ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, దేగాంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలకు ఈ దవాఖానా ఎంతో ఉపయోగకరమని, దీనిని ప్రారంభించకపోతే తాళం పగులగొడతామని హెచ్చరించారు.
సమావేశంలో ఉన్న మార్కెట్ కమిటీ చైర్మన్ అనంద్ రావ్ పటేల్ కాంట్రాక్టర్‌తో ఫోన్లో మాట్లాడి, భవనాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సర్పంచ్ ఇతర సమస్యలను కూడా సమావేశంలో ప్రస్తావించారు.












