తెలంగాణలో పెండింగ్లో ఉన్న పలు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్, ఫెడరేషన్ల చైర్ పర్సన్ల నియామకాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో 17 చేతి వృత్తుల కుల సంఘాలకు చైర్పర్సన్లను నియమించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, ఆశావహులైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
ఈ నియామకాల ప్రక్రియపై బుధవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం నిర్వహించింది. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ, అభ్యర్థుల ఎంపిక వంటి పలు అంశాలపై వారు సమగ్రంగా చర్చించారు.
నామినేటెడ్ పోస్టులను వీలైనంత త్వరగా భర్తీ చేయాలనే యోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఈ కసరత్తు ప్రక్రియకు పచ్చజెండా ఊపినట్లు సమాచారం. పార్టీ గెలుపు కోసం, అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించిన నాయకులను గుర్తించి వారికి నామినేటెడ్ పదవులు కేటాయించాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు తెలుస్తోంది.
నామినేటెడ్ పదవుల కేటాయింపులో సామాజిక సమీకరణాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేయాలని భావిస్తోంది. ఎవరికీ అన్యాయం జరగకుండా, అన్ని వర్గాలను పరిగణనలోకి తీసుకుని, సమన్యాయం జరిగేలా ఆశావహుల జాబితాను సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.








