తమిళనాడులో నూతన రాజకీయ అధ్యాయానికి తెరలేవనుంది. సినీ నటుడు విజయ్, రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. ఎన్నికల్లో సాధించిన అఖండ విజయంతో, ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలాన్ని కూడగట్టారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ 108 స్థానాల్లో విజయం సాధించింది. ప్రభుత్వం ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరి. ఈ నేపథ్యంలో, వీసీకే, సీపీఐ, సీపీఎం పార్టీల మద్దతుతో విజయ్ పార్టీకి మొత్తం 118 మంది ఎమ్మెల్యేల బలం చేకూరింది.
ప్రమాణ స్వీకారం అనంతరం, మద్దతు తెలిపిన పార్టీలకు కేబినెట్లో చోటు కల్పించనున్నట్లు తెలుస్తోంది. సుమారు 20 మంది మంత్రులతో కూడిన మంత్రివర్గాన్ని విజయ్ ఏర్పాటు చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
విజయ్ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు, పలువురు సినీ ప్రముఖులను ఆహ్వానించారు. స్టాలిన్, పళనిస్వామి వంటి నాయకులను కూడా ఆహ్వానించాలని నిర్ణయించారు.
తొలిసారి ఎన్నికల బరిలోకి దిగి, ఐదు దశాబ్దాల అనుభవం ఉన్న పార్టీలను మట్టికరిపించిన విజయ్, ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక పరిణామంగా అభివర్ణించబడుతోంది.








