రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్రవ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. అకాల వర్షాల నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలలో తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని, రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.
హైదరాబాద్ లోని రాష్ట్ర సచివాలయం నుంచి మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలు కేంద్రాలలో సరిపడా టార్పలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలని, వాతావరణ శాఖ హెచ్చరికలను ఎప్పటికప్పుడు రైతులకు తెలియజేయాలని సూచించారు.
నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటికే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, నిర్ణీత సమయానికి ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. అకాల వర్షాలపై అప్రమత్తంగా ఉంటామని, వాతావరణ పరిస్థితులను రైతులకు తెలియజేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, పౌరసరఫరాల అధికారి, మేనేజర్ లు, డిఆర్డిఓ విజయలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత, సమర్థతపై ఈ సందర్భంగా చర్చించారు.












