తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో, రానున్న రోజుల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా తెలంగాణలోని కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయబడింది.
తెలంగాణలో రాబోయే నాలుగు, ఐదు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న రెండు రోజులు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పు ఉండదని, ఆ తర్వాత మూడు రోజులలో ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది.
సోమవారం (మే 4) రోజున తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భదాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నాగర్ కర్నూలు జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయబడిందని వాతావరణ కేంద్రం పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్లో ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ద్రోణి ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మీదుగా కొమోరియన్ ప్రాంతం వరకు విస్తరించి కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
సోమవారం రోజున ఉత్తర కోస్తాంధ్రలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.








