ఖానాపూర్, 2026-08-08
ఖానాపూర్: సదర్మాట్ కెనాల్‌కు నీటి విడుదలకు ముహూర్తం ఖరారు కావడంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో కొంత ఊరట చెందిన రైతులు, ఇప్పుడు సాగునీరు అందుబాటులోకి రానుండటంతో సాగు పనులకు సిద్ధమవుతున్నారు.
ఖానాపూర్, ఆగస్టు 8, మనోరంజని తెలుగు టైమ్స్: ఎట్టకేలకు సదర్మాట్ కెనాల్‌కు నీటి విడుదలకు ముహూర్తం ఖరారు కావడంతో ఆయకట్టు రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురవక రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఇటీవల కురిసిన వర్షాలతో వాతావరణం చల్లబడటంతో రైతులు ఊరట చెందారు.
సాగునీటిపై ఆందోళన
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు లేకపోవడంతో ఈసారి సాగునీటి పరిస్థితిపై రైతుల్లో ఆందోళన నెలకొంది. తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలను సాగు చేయాలని ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచిస్తూ రైతు వేదికల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.
నీటి విడుదలకు ఏర్పాట్లు
ఈ నేపథ్యంలో సదర్మాట్ కెనాల్‌కు నీటి విడుదలకు ముహూర్తం ఖరారు కావడం రైతులకు చల్లని కబురు అందించినట్లయింది. ఇటీవల వర్షాలు లేకపోవడంతో సదర్మాట్ కెనాల్‌కు నీటిని విడుదల చేయాలంటే ఉన్నతాధికారుల ఆదేశాలు అవసరమని ఎమ్మెల్యే మండల సమావేశంలో వెల్లడించారు. తాజాగా ఆయకట్టు ప్రాంతానికి సదర్మాట్ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు.
ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభం
ఎమ్మెల్యే చేతుల మీదుగా సదర్మాట్ కెనాల్‌కు నీటి విడుదల కార్యక్రమం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ నాయకులు, అధికారులు తెలిపారు. దీంతో సదర్మాట్ ఆయకట్టు పరిధిలోని రైతులు సాగు పనులకు సిద్ధమవుతున్నారు. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సాగునీరు అందుబాటులోకి రానుండటంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.












