** (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 27
నిర్లక్ష్యం, ఫోన్‌తోనే సావాసం, టెక్నాలజీ భాషే తెలుసు.. అంటూ జెన్‌జీ అమ్మాయిలపై ఉన్న అపవాదులను చెరిపివేస్తూ, తాజా నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా దిల్లీలో జరిగిన మహాధర్నాలో విద్యార్థులు ముందుండి పోరాడారు. పోలీసులు అడ్డుకున్నా, లాఠీ దెబ్బలు తగిలినా వెనకడుగు వేయకుండా, తమ హక్కుల కోసం నిలబడ్డారు. ఈ క్రమంలోనే, ముంబైలో రియా ఆహిర్ అనే యువతి, పోలీసు వ్యాన్‌ను అడ్డుకుని విద్యార్థులకు అండగా నిలిచి వార్తల్లోకెక్కారు.
‘అబ్బ ఈ అమ్మాయిలతో కష్టం...’ నిన్నమొన్నటి వరకూ జెన్‌జీ అమ్మాయిల గురించి వినిపించిన మాటే ఇది. నిర్లక్ష్యం, ఫోన్‌తోనే సావాసం, టెక్నాలజీ భాషే తెలుసు... వీటికి నానార్థాలుగా కనిపించేవారు. కానీ ఇదంతా తప్పు... మేము వేరే అని నిరూపించారు. వాళ్ల అడ్డా... సోషల్‌మీడియానే కాదు... ప్రపంచమంతా చెబుతున్న మాట ఇది!
తాజా ఫ్యాషన్, సోషల్‌మీడియా, సెల్ఫీలు, ఎంటర్టైన్మెంట్ ఇవి ఉంటే చాలు... జెన్ జీ అమ్మాయిలకు అనుకునేవారంతా. పోలీసులు, అరెస్టులు, లాఠీ దెబ్బలు, నీరు, టియర్‌గ్యాస్ ప్రయోగాలేవీ ఆ అమ్మాయిలను భయపెట్టలేదు. కాబట్టే, ముందుండి నలుగురినీ నడిపించారు. తెర వెనకకే పరిమితం కాము... నేరుగా ప్రశ్నించడానికీ వెనకాడబోమని నిరూపించారు. ఒంటిచేత్తో పోలీసు బండిని ఆపారు. ఇతరులను కాపాడటానికి లాఠీకి వెన్నుకాశారు. సుకుమారులన్న మాటకి ధీటైన సమాధానమిచ్చారు.
ఓపిక ఉండదు, ఒకదాని మీద ధ్యాసే కుదరదు, సవాళ్లంటే ఆమడదూరం పరిగెడతారు... వాళ్ల తీరుతో ఇలాంటి చాలా బిరుదులే తెచ్చుకున్నారు. మండుటెండ, ఆకలిదప్పులు లెక్కచేయక... గంటలకొద్దీ ధర్నాలో పాల్గొన్నారు. ఓపికగా వ్యవహరిస్తూ ఆశ్చర్యపరిచారు. తోటివారికి సాయపడ్డారు. కాబట్టే, తరాలతో సంబంధం లేకుండా ఎంతోమంది మహిళలు వీరికి దన్నుగా నిలిచారు. వాళ్లలోకం వాళ్లది... ప్రజా సమస్యల్లోకి పొరపాటున కూడా తొంగిచూడరన్న అపవాదు సరేసరి. వార్తాపత్రికలు, న్యూస్‌కి దూరం కదా మరి. అయితేనేం, ఒక్కటిగా చేరి ప్రశ్నించారు. బృందాలను నడిపించారు.
వలంటీర్లుగా మారి రోడ్లు, అల్లర్లు జరుగుతోన్న ప్రాంతాలను శుభ్రపరిచారు, ఆహారం, నీళ్లు అందించారు. సోషల్‌మీడియాలో అవగాహన కల్పిస్తూనే నేరుగానూ శాంతియుతంగా వ్యవహరించేలా చూశారు. మొత్తంగా ఇదే ఈ తరం అమ్మాయిల ధోరణి అన్న అపవాదును మార్చారు. అందుకు వేదికైంది తాజా ‘నీట్’ పేపర్ లీక్‌కి వ్యతిరేకంగా విద్యార్థులు దిల్లీలో చేపట్టిన మహాధర్నా.
నాలుగు గోడలకే పరిమితం కావాలి... సుకుమారులు, ఎవరో ఒకరి రక్షణ తప్పనిసరి... ఎవరేమైనా అన్నా మౌనంగా భరించాలి... గొంతు లేవకూడదు, గొడవలకు దూరంగా ఉండాలి... అన్న పాత సిద్ధాంతాలకీ చెల్లుచీటీ పలికారు. ధైర్యం మా మారుపేరంటూ సరికొత్తగా చాటుతున్నారు. అందుకే ఈ తరం కాదు కాదు... జెన్ జీ అమ్మాయిలు వేరే... ప్రత్యేకమంతే అంటున్నారంతా! కాదనగలమా?
ముంబయి.. శివాజీ పార్క్ దగ్గర్లో... ‘నీట్- యూజీ పేపర్ లీక్’కి సమాధానం చెప్పాలంటూ విద్యార్థులంతా నినాదాలు చేస్తున్నారు. పోలీసులు వాళ్లలో చాలామందిని వ్యాన్ ఎక్కించారు. ఎక్కడికో తరలిస్తున్నారు. దానిలోకి ఎక్కినా నినాదాలు ఆపలేదు. ఇంతలో అక్కడికి వచ్చారో యువతి... తనే రియా ఆహిర్. ఆమె సేవాకార్యకర్త కాదు. విద్యార్థులకు సంఘీభావం పలుకుతున్న వ్యక్తీ కాదు. అయినా పోలీసు వ్యాను ముందు ఒంటరిగా నిల్చున్నారు. జోరుగా వాన పడుతున్నా ఏకంగా 45 నిమిషాలు దాన్ని ముందుకు కదలనీయలేదు.












