రాష్ట్ర ముఖ్యమంత్రి బాసర పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పటిష్టంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఆయన అధికారులతో కలిసి ఏర్పాట్లు, భద్రతా చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, సోమవారం జరగనున్న ముఖ్యమంత్రి పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ప్రారంభించనున్న అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను సంబంధిత ప్రదేశాల్లో భద్రతా అధికారులకు వివరించారు. పర్యటన సజావుగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ఆలయ ఈవో కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఇప్పటికే పలుమార్లు సమావేశాలు నిర్వహించి, అధికారులకు వారి బాధ్యతలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. భద్రతా విభాగం అధికారులు మాట్లాడుతూ, ప్రతి అధికారి తమకు కేటాయించిన విధులను కచ్చితంగా నిర్వర్తించాలని, పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, జిల్లా ఎస్పీ జానకి షర్మిల, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆలయ ఈవో విజయరామారావు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పర్యటనకు సంబంధించిన అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.












