రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రానున్న 6వ తేదీన బాసర పర్యటన నేపథ్యంలో, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి శుక్రవారం ఏర్పాట్లను పరిశీలించారు. బాసర అభివృద్ధి పనులకు రూ.300 కోట్లు కేటాయించి, దేవాలయాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అధికారులు చేపడుతున్న ఏర్పాట్లను మంత్రులు సమీక్షించారు. ఆలయ ప్రాంగణాన్ని సందర్శించి, దేవతామూర్తులను దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేయనున్న ప్రదేశాలను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. పర్యటన విజయవంతం కావాలని ఆదేశించారు.
రాజన్న అతిథి గృహంలో జరిగిన సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, బాసర అభివృద్ధికి రూ.300 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేశామని, దీని ద్వారా దేవాలయాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు.
గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఈ నెల 6న ముఖ్యమంత్రి చేతుల మీదుగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరుగుతాయని, అధికారులు సమన్వయంతో పనిచేసి పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు.












