గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్లు (ఆర్ఎంపీలు) మరింత చేరువ అవ్వాలని ఆర్ఎంపి అసోసియేషన్ బైంసా డివిజన్ అధ్యక్షులు మోహన్ పిలుపునిచ్చారు. వేసవి నేపథ్యంలో ఉచిత వైద్య సేవలు అందించాలని సూచించారు.
బైంసా మండలంలోని మాటేగం గ్రామంలో ఆదివారం నిర్వహించిన ఆర్ఎంపి అసోసియేషన్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మోహన్, గ్రామీణ ప్రజలకు ఆర్ఎంపీల సేవలు మరింత అందుబాటులోకి తీసుకురావాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు.
వేసవి కాలంలో వృద్ధులు, పిల్లలు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని, వారికి ఉచిత వైద్య సేవలు అందించడంలో ఆర్ఎంపీలు చురుగ్గా పాల్గొనాలని ఆయన కోరారు. ఇది ప్రజల ఆరోగ్య సంరక్షణకు దోహదపడుతుందని తెలిపారు.
మరోవైపు, వేసవి తాపాన్ని తగ్గించేందుకు త్వరలోనే భైంసా డివిజన్ స్థాయిలో చలివేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు మోహన్ ప్రకటించారు. దీని ద్వారా ప్రజలకు ఉపశమనం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో బైంసా మండల అధ్యక్షులు అర్జున్ కధం, కార్యదర్శి కపిల్ దక్డే, కోశాధికారి తుకారాం, సీనియర్ ప్రాక్టీషనర్లు పోశెట్టి, అశోక్, సూర్యవంశం అశోక్, నాగుల సాయినాథ్, బద్రి నారాయణ, చంద్రయ్య, శివ యాదవ్, రాజు, ఆసం నవీన్, కరీం తదితరులు పాల్గొన్నారు.












