సందర్బంగా (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 06
వచ్చే ఏడాది నుంచి గోదావరి పుష్కరాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో విస్తృత ఏర్పాట్లు చేపడుతోందని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఆదివారం బాసరలో రూ.20 కోట్లతో పుష్కర ఘాట్ల అభివృద్ధి పనులకు, రూ.354 కోట్లతో శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ సమగ్ర అభివృద్ధి, నూతన నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ప్రపంచానికి తెలంగాణ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పేలా వచ్చే ఏడాది నుంచి గోదావరి పుష్కరాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో విస్తృత ఏర్పాట్లు చేపడుతోందని రాష్ట్ర మద్యం, ఆబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పుష్కరాలకు ఏడాది ముందుగానే మౌలిక వసతులు, పుష్కర ఘాట్లు, ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు.
ఆదివారం బాసరలో పర్యటించిన మంత్రి జూపల్లి కృష్ణారావు రూ.20 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పుష్కర ఘాట్ల నిర్మాణం, విస్తరణ, మరమ్మతులు, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం గోదావరి నదీమాతకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రూ.354 కోట్లతో చేపట్టనున్న ఆలయ సమగ్ర అభివృద్ధి, నూతన నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ ప్రాంగణాన్ని ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయడంతో పాటు భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. భవిష్యత్‌లో పెరగనున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన మౌలిక వసతులను ముందుగానే ఏర్పాటు చేయాలని సూచించారు.
గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున భక్తుల సౌకర్యం, భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పుష్కర ఘాట్లను అవసరమైన మేరకు విస్తరించడంతో పాటు, కొత్త ఘాట్ల నిర్మాణం, మరమ్మతులు చేపట్టాలని అన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అదనపు సౌకర్యాలు కల్పించాలని సూచించారు. మహిళల కోసం ప్రత్యేక డ్రెస్సింగ్ రూములు, మరుగుదొడ్లు, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రధాన పుష్కర ప్రాంతాల్లో 24 గంటల వైద్య సేవలు అందుబాటులో ఉండేలా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, అవసరమైన వైద్యులు, అత్యవసర మందులు, అంబులెన్స్‌లను ముందుగానే సిద్ధంగా ఉంచాలని మంత్రి సూచించారు.
భక్తుల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టాలని సూచించారు. పోలీసు, రెవెన్యూ, దేవాదాయ, వైద్య, మున్సిపల్ తదితర శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అన్నారు. పుష్కర ప్రాంతాల్లో నిరంతర పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక సిబ్బందిని నియమించాలని, భక్తులకు నిరంతరం స్వచ్ఛమైన తాగునీరు, మరుగుదొడ్లు, ఇతర ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.












