Hyderabad/Shaikpet (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 22
సిద్ధాపూర్లో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్ ఏర్పాటు వల్ల ప్రజారోగ్యం, పర్యావరణం, వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడుతుందని షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, ఆయన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డిని కలిసి డంపింగ్ యార్డ్ దుష్ఫలితాలపై ప్రజెంటేషన్ ఇచ్చి వినతిపత్రం అందజేశారు.
సిద్ధాపూర్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే ప్రజలు, రైతులు, పరిసర గ్రామాలపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం ఉందని షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి అన్నారు. ఈ మేరకు డంపింగ్ యార్డ్ వల్ల కలిగే దుష్ఫలితాలను వివరిస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డికి ప్రజెంటేషన్ ఇచ్చి వినతిపత్రం అందజేశారు.
డంపింగ్ యార్డ్ ఏర్పాటు వల్ల భూగర్భ జలాలు కలుషితమయ్యే ప్రమాదం, చెత్త నుంచి వెలువడే రసాయనాలు, విషపదార్థాలు నేలలోకి చేరి వ్యవసాయ భూముల నాణ్యత దెబ్బతినే అవకాశం ఉందని కలెక్టర్‌కు వివరించారు. అదేవిధంగా చెత్త కుళ్లడం ద్వారా వెలువడే దుర్వాసన, హానికర వాయువుల కారణంగా గాలి కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని తెలిపారు. డంపింగ్ యార్డ్ పరిసరాల్లో దోమలు, ఈగలు, కీటకాలు పెరిగి అంటువ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారిపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. చెత్త నుంచి వచ్చే లీచేట్ (కలుషిత ద్రవం) భూమిలోకి చొచ్చుకుపోతే బోర్లు, బావులు, చెరువులు, ఇతర నీటి వనరులు కలుషితం అయ్యే ప్రమాదం ఉందని వివరించారు. అలాగే డంపింగ్ యార్డ్‌కు ప్రతిరోజూ భారీ వాహనాల రాకపోకలు పెరగడం వల్ల రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు, దుమ్ము కాలుష్యం, శబ్ద కాలుష్యం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. భవిష్యత్తులో జనాభా పెరిగే కొద్దీ చెత్త పరిమాణం పెరిగి సమస్య మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ ఏర్పాటు అంశంపై జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి డంపింగ్ యార్డ్ వ్యతిరేక కమిటీ జేఏసీ సభ్యులతో సుదీర్ఘంగా చర్చించారు. ప్రజల అభ్యంతరాలు, స్థానిక పరిస్థితులను పరిశీలించి ప్రత్యామ్నాయ మార్గాలను చూస్తున్నట్లు కలెక్టర్ సూచనప్రాయంగా వెల్లడించినట్లు మాజీ ఎమ్మెల్యే తెలిపారు. దీంతో సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ అంశంలో సానుకూల పరిణామాలు చోటుచేసుకుంటాయనే ఆశాభావం వ్యక్తమవుతోంది.
సిద్ధాపూర్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయాన్ని ప్రజలు, కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదని మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యం, పర్యావరణం, వ్యవసాయం, భూగర్భ జలాలను కాపాడేందుకు ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి అధికారికంగా ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కలెక్టర్‌ను కోరారు. అవసరమైతే ప్రజల పక్షాన మరింత పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఆయన తెలిపారు.
కలెక్టర్‌ను కలిసిన వారిలో మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్యామ్ సుందర్ రెడ్డి, డంపింగ్ యార్డ్ వ్యతిరేక కమిటీ జేఏసీ చైర్మన్ అంబటి ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్లారం శేఖర్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, జేఏసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.












