ముథోల్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 21
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తూ, ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని మండల కేంద్రం ముథోల్‌లోని దుకాణదారులకు గ్రామపంచాయతీ ఈవో అన్వర్ అలీ నోటీసులు జారీ చేశారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
మండల కేంద్రం ముథోల్‌లోని దుకాణాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయాలని, ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని గ్రామపంచాయతీ ఈవో అన్వర్ అలీ ఆదేశించారు. ఈ మేరకు దుకాణదారులకు నోటీసులు జారీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనల ప్రకారం ఒకసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్ వస్తువుల వినియోగం, నిల్వ, విక్రయం, పంపిణీ పూర్తిగా నిషేధించబడిందని తెలిపారు. దుకాణాల్లో తడి, పొడి వ్యర్థాలను వేర్వేరుగా సేకరించి, పర్యావరణానికి హాని కలగకుండా శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాలని సూచించారు.
నిబంధనలను తక్షణమే అమలు చేయాలని, వాటిని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా, ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడంలో ప్రతి దుకాణదారు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరారు.












