నిర్మల్, 29 July
సమాజానికి సరైన దిశానిర్దేశం చేసేది గురువులేనని, వారి సేవలను గుర్తించి గౌరవించుకోవాలని తపస్ నిర్మల్ జిల్లా శాఖ పిలుపునిచ్చింది. గురుపౌర్ణిమ సందర్భంగా నిర్వహించిన గురువందన్ కార్యక్రమంలో విద్యారంగంలో విశిష్ట సేవలు అందించిన నలుగురు ప్రముఖులను సన్మానించారు.
సమాజానికి సరైన దశను, దిశను నిర్దేశించేది ఆదర్శవంతమైన గురువులేనని, పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో సేవలు అందిస్తూ విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దడం ఆదర్శవంతమైన గురువుల లక్షణమని తపస్ నిర్మల్ జిల్లా శాఖ పేర్కొంది.
భారతీయ సమాజంలో ప్రాచీన కాలం నుండి ఆధునిక కాలం వరకు గురువుల వల్లే దేశ నిర్మాణం, వ్యక్తి నిర్మాణం, సమాజ నిర్మాణం జరిగిందని తెలిపింది. గురుపౌర్ణిమ ఉత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువందన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న రావుల సూర్యనారాయణ (దక్షిణ మధ్య భారత విద్యా ప్రముఖ్), డాక్టర్ యు రవికుమార్ (ఆంగ్ల ఉపన్యాసకులు), కడార్ల రవీంద్ర (విశ్రాంత ఉపాధ్యాయులు), పట్వారి శ్రీనివాస్ (పూర్వ ఆచార్యులు) లను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా అధ్యక్షులు గోనెల శశిరాజ్, రాష్ట్ర బాధ్యులు జిలకర రాజేశ్వర్, నాయకులు రమణ, నరేష్, శ్రీకాంత్, వెంకట్ లు పాల్గొన్నారు.












