గురుకుల పాఠశాల, కమ్మదనం (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 04
కమ్మదనం గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న గిరిజన విద్యార్థిని అశ్విని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ కేసులో ఇంగ్లీష్ లెక్చరర్ శ్యామలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థిని తరగతి గది నుంచి వెళ్లిపోయిన సమయంలో పర్యవేక్షణ లోపంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
*ఇంగ్లీష్ లెక్చరర్ శ్యామల సస్పెన్షన్* *కమ్మదనం గురుకులంలో అశ్విని ఆత్మహత్య ఘటన..* కమ్మదనం గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్న గిరిజన విద్యార్థిని అశ్విని ఆత్మహత్య వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ ఘటనకు సంబంధించి పాఠశాలలో ఇంగ్లీష్ లెక్చరర్‌గా పనిచేస్తున్న శ్యామలను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అశ్విని ఆత్మహత్య చేసుకున్న రోజున ఇంగ్లీష్ లెక్చరర్ శ్యామల క్లాస్ నిర్వహిస్తున్న సమయంలోనే ఆమె తరగతి గది నుంచి బయటకు వెళ్లినట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. అనంతరం అశ్విని తన పడకగదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విద్యార్థిని క్లాస్రూమ్ నుంచి వెళ్లిపోతున్న విషయాన్ని క్లాస్ టీచర్ గమనించకపోవడం, ఆమె భద్రతపై పర్యవేక్షణ లోపించడం తదితర అంశాలను అధికారులు పరిశీలించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో విచారణ పూర్తయ్యే వరకు శ్యామలను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే అశ్విని ఆత్మహత్యకు అసలు కారణాలేమిటన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఆమె ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సమగ్ర విచారణ జరపాలని విద్యార్థి సంఘాలు, గిరిజన సంఘాలు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. గురువారం కమ్మదనం గురుకుల పాఠశాల వద్ద విద్యార్థి సంఘాలు, గిరిజన నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. అశ్విని మృతిపై పారదర్శకంగా విచారణ జరిపి, ఘటనకు దారితీసిన పూర్తి కారణాలను వెలుగులోకి తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. తాజాగా ప్రభుత్వం ఇంగ్లీష్ లెక్చరర్ శ్యామలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ వ్యవహారంపై విచారణ మరింత కీలకంగా మారింది. అశ్విని ఆత్మహత్యకు దారితీసిన అసలు కారణాలు ఏమిటి? ఘటనకు ముందు గురుకులంలో ఏం జరిగింది? అనే అంశాలపై అధికారులు చేపడుతున్న విచారణలో పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.. *KP*











