రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ముత్యాల పోచమ్మ తల్లి, పోతరాజు స్వామి ప్రతిష్ఠాపన మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
గ్రామంలో మూడు రోజుల పాటు జరిగిన ఉత్సవాల్లో భాగంగా, పది మంది వైదికుల సమక్షంలో ముత్యాల పోచమ్మ తల్లి ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, గ్రామం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు.
ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతిష్ఠాపన అనంతరం అన్నప్రసాద వితరణ చేపట్టారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, సర్పంచ్, ఉప సర్పంచ్, కోశాధికారితో పాటు పలువురు రాజకీయ నాయకులు, కమిటీ సభ్యులు, మహిళలు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.












