లోకేశ్వరం పోలీసులు, భైంసా మండలం చుచుంద్ గ్రామానికి చెందిన కొబ్బుల్లా మారుతి, పిల్లోల్ల రాజు అనే ఇద్దరు వ్యక్తులను ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడిన కేసులో అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.6 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, మే 8వ తేదీ అర్ధరాత్రి లోకేశ్వరం శివాలయంలోకి గోడ దూకి ప్రవేశించిన నిందితులు, హుండీని పగులగొట్టే ప్రయత్నం చేశారు. ఆలయంలో అలారం మోగడంతో గ్రామస్తులు అక్కడికి చేరుకోగా, నిందితులు తప్పించుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు, మే 10న చుచుంద్ గ్రామంలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. చెడు వ్యసనాలకు బానిసై, సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో పలు ఆలయాల్లో చోరీలకు పాల్పడినట్లు వెల్లడించారు.
నిందితులు లోకేశ్వరం శివాలయం, బాగాపూర్ లక్ష్మీనారాయణ ఆలయం (రెండు సార్లు), జగన్ మోహన్ రెడ్డి గెస్ట్ హౌస్ బాగాపూర్, ఎడ్బిడ్ గ్రామంలోని మల్లన్న ఆలయం, మాచకల్ పోచమ్మ ఆలయం, రాంటెక్ మహాదేవ ఆలయం, ఈలేగం మార్కండేయ ఆలయాల్లో చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు.
ఈ కేసును ఛేదించడంలో ఏఎస్పీ పత్తిపాక సాయి కిరణ్ పర్యవేక్షణలో ముధోల్ సీఐ రవీందర్ నాయక్, లోకేశ్వరం ఎస్సై అశోక్ కీలక పాత్ర పోషించారు. ఆలయాలు, ప్రజా ఆస్తులపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తుల సంచారంపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.












