తమిళనాడు (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 02
అప్పుల బాధ భరించలేక, భర్తను చంపేందుకు భార్య, ఆమె సోదరుడు పథకం రచించారు. నిద్రలో ఉన్న భర్త చెవిలో విషం పోసిన ఘటన తమిళనాడులోని తంజావూరు జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు భార్య, సోదరుడిని అరెస్టు చేశారు.
తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. అప్పుల భారం నుంచి తప్పించుకోవడానికి భర్తను చంపేందుకు భార్య, ఆమె సోదరుడు పథకం రచించారు. నిద్రలో ఉన్న భర్త చెవిలో విషం పోసి చంపేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో భార్య ఉమారాణి (48), ఆమె సోదరుడు జ్ఞానశేఖరన్ (35)లను పోలీసులు అరెస్టు చేశారు.
వివరాల్లోకి వెళితే.. తంజావూరు జిల్లా, తిరువిడైమరుదూర్ తాలూకాలోని పుళుదికుడికి చెందిన కూలీ రవిచంద్రన్ (54)ను 27 ఏళ్ల క్రితం ఉమారాణి వివాహం చేసుకుంది. వీరి కుమారుడు విదేశాలలో పని చేస్తుండగా, కుమార్తెకు పెళ్లైంది. రవిచంద్రన్ కొత్తగా ఇంటి నిర్మాణం కోసం పాలారి-డ్యామ్, ఇతర గ్రూపుల నుంచి రూ.10 లక్షల రుణం తీసుకున్నాడు.
ఈ రుణాన్ని చెల్లించలేకపోవడంతో తరచూ దంపతుల మధ్య గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో తన భర్త చనిపోతే రుణం తీర్చాల్సిన ఒత్తిడి ఉండదని ఉమారాణి భావించింది. దీంతో తన తమ్ముడు జ్ఞానశేఖరన్తో కలిసి భర్తను చంపేందుకు స్కెచ్ వేసింది. మంగళవారం రాత్రి రవిచంద్రన్ నిద్రిస్తున్న సమయంలో అతడి చెవిలో వారిద్దరూ విషం పోశారు.
అయితే, మేల్కొన్న రవిచంద్రన్ వారి నుంచి తప్పించుకుని స్థానికుల సహాయంతో కుంభకోణం ఆస్పత్రిలో చేరాడు. అతని ఫిర్యాదు ఆధారంగా, తిరువిడైమరదూర్ పోలీసులు కేసు నమోదు చేసి ఉమారాణి, జ్ఞానశేఖర్లను అరెస్టు చేశారు. ప్రాథమిక విచారణలో మూడు నెలల క్రితమే ఆ ఇద్దరూ టీలో విషం కలిపి అతన్ని చంపడానికి ప్రయత్నించినట్లు తేలింది. ఆ ఘటన నుంచి తప్పించుకున్న రవిచంద్రన్, అప్పటి నుంచి ఇంట్లో ఏమీ తినకుండా జాగ్రత్త పడుతున్నాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే తాజాగా చెవిలో విషం పోసినట్లు నిర్ధారించారు. నిందితులిద్దరినీ కోర్టులో హాజరుపరిచిన అనంతరం రిమాండ్ నిమిత్తం తంజావూరు జైలుకు తరలించారు.












