నేరడిగొండ, జూలై 2
తెలంగాణ రక్షణ సేన పార్టీ కార్యకలాపాలకు ఆటంకాలు కల్పించవద్దని ఆ పార్టీ నేరడిగొండ మండల కన్వీనర్ బానోత్ వసంత్ రావు సంబంధిత అధికారులను కోరారు. హైదరాబాద్కు వెళ్లవద్దని నేరడిగొండ పోలీస్ స్టేషన్ నుంచి తనకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆయన ఆరోపించారు.
తెలంగాణ రక్షణ సేన పార్టీ కార్యకలాపాలను అడ్డుకునే ప్రయత్నాలు మానుకోవాలని ఆ పార్టీ నేరడిగొండ మండల కన్వీనర్ బానోత్ వసంత్ రావు కోరారు.
గురువారం ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్కు వెళ్లవద్దంటూ నేరడిగొండ పోలీస్ స్టేషన్ నుంచి తనకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి రాజకీయ పార్టీకి శాంతియుతంగా తమ రాజకీయ కార్యక్రమాలు నిర్వహించే రాజ్యాంగబద్ధమైన హక్కు ఉందని అన్నారు. తెలంగాణ రక్షణ సేన పార్టీ కార్యకలాపాలకు ఎలాంటి అనవసర ఆటంకాలు కల్పించకుండా, రాజ్యాంగం కల్పించిన హక్కులను గౌరవించాలని సంబంధిత అధికారులను కోరారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం కేటాయిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు కాలేదని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేసి, రాష్ట్రంలోని అర్హులైన తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ రక్షణ సేన పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని బానోత్ వసంత్ రావు తెలిపారు.












