నిర్మల్, 01.07.2026
నిర్మల్ జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్–XII అమలుపై జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ అధ్యక్షతన సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. అదృశ్యమైన చిన్నారులను గుర్తించడం, బాల కార్మికత్వం, భిక్షాటనం, మానవ అక్రమ రవాణా వంటి వాటి నుంచి రక్షించడం ఈ ఆపరేషన్ లక్ష్యమని ఎస్పీ తెలిపారు.
జూలై నెల పొడవునా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న ఆపరేషన్ ముస్కాన్–XII విజయవంతమైన అమలుపై నిర్మల్ జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ అధ్యక్షతన సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ఆపరేషన్ ముస్కాన్–XII ప్రధాన లక్ష్యం అదృశ్యమైన చిన్నారులను గుర్తించి వారి కుటుంబాలకు సురక్షితంగా చేర్చడం, బాల కార్మికత్వం, బాల భిక్షాటనం, మానవ అక్రమ రవాణా మరియు ఇతర దోపిడీ లేదా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న చిన్నారులను గుర్తించి రక్షించడం, వారికి చట్టపరమైన రక్షణ, వైద్య సేవలు, కౌన్సెలింగ్, పునరావాసం కల్పించి వారి భవిష్యత్తును భద్రపరచడం అని తెలిపారు.
ఆపరేషన్ విజయవంతంగా అమలు కావాలంటే స్పెషల్ జువెనైల్ పోలీస్ యూనిట్ (SJPU), జిల్లా బాలల పరిరక్షణ అధికారి (DCPO), చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC), మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖ, విద్యాశాఖ, స్వచ్ఛంద సంస్థలు (NGOs) తదితర సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. చిన్నారులను గుర్తించడం నుంచి వారి పునరావాసం, కుటుంబాలతో సురక్షితంగా పునరేకీకరణ వరకు అన్ని శాఖలు సమిష్టిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా పరిశ్రమలు, హోటళ్లు, ఢాబాలు, గ్యారేజీలు, వర్క్‌షాపులు, నిర్మాణ ప్రాంతాలు, ఇటుక బట్టీలు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్ ప్రాంతాలు తదితర చోట్ల ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని, బాల కార్మికత్వం, బాల భిక్షాటనం లేదా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న చిన్నారులు గుర్తించిన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకొని వారికి అవసరమైన సంరక్షణ, పునరావాసం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు తమ శాఖల పరిధిలో చేపట్టాల్సిన చర్యలపై చర్చించి, ఆపరేషన్ ముస్కాన్–XIIను సమన్వయంతో విజయవంతం చేయడానికి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్, జిల్లా అదనపు పోలీసు అధికారి డి. ఉపేందర్ రెడ్డి, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, జిల్లా పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది, స్పెషల్ జువెనైల్ పోలీస్ యూనిట్ (SJPU) ప్రతినిధులు, జిల్లా బాలల పరిరక్షణ అధికారి (DCPO), చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) సభ్యులు అనిల్, శ్రీలత, జిల్లా సంక్షేమ అధికారి వినూత్న, జిల్లా కార్మిక అధికారి రాజలింగం, ముస్కాన్ జిల్లా ఇంచార్జీ ఎస్ఐ అజయ్, సబ్ డివిజన్ ఇంచార్జీ డబ్ల్యుఎస్‌ఐ శ్రావణి, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖ, విద్యాశాఖతో పాటు ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.












