పెళ్లికి నిరాకరించిందని ప్రియురాలికి హెచ్ఐవీ పాజిటివ్ రక్తాన్ని ఎక్కించిన ఘటనలో బాధితురాలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పరిధిలో చోటుచేసుకుంది.
జనగామ జిల్లాకు చెందిన యువకుడు (24) తన మరదలిని (20) ప్రేమించి, వివాహానికి సిద్ధమయ్యాడు. అయితే, యువకుడికి హెచ్ఐవీ ఉన్నట్లు తెలియడంతో యువతి తండ్రి వివాహాన్ని రద్దు చేసుకున్నారు.
దీంతో, యువకుడు ఆమెను తనతోనే వివాహం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో, ఆమెకు హెచ్ఐవీ రక్తాన్ని ఎక్కించాలని పన్నాగం పన్నాడు. గత నెల 11న సిరంజీతో ఆమెకు బలవంతంగా రక్తాన్ని ఎక్కించి, అక్కడి నుంచి పరారయ్యాడు.
బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, నిందితుడైన యువకుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోంది.
హెచ్ఐవీ రక్తం ఎక్కించిన ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు, తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.











