నిర్మల్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లా పోలీస్ శాఖ కఠిన చర్యలు చేపట్టింది. అక్రమ రవాణాకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. గత వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలతో తనిఖీలు, దాడులు నిర్వహిస్తున్నారు.
ఇసుక అక్రమ రవాణా మరియు నిల్వలను పూర్తిగా అరికట్టేందుకు అత్యంత కఠిన చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఈ సమస్యను తీవ్రంగా పరిగణిస్తూ, సంబంధిత పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిరంతర తనిఖీలు, దాడులు నిర్వహిస్తున్నారు.
ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సారంగపూర్, లోకేశ్వరం, బాసర, భైంసా, భైంసా రూరల్, లక్ష్మణచందా మండలాల పరిధిలో ప్రత్యేక బృందాలతో విస్తృతంగా రైడ్లు నిర్వహించి, అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడుతున్న ట్రాక్టర్లు, టిప్పర్లు, ఇతర వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేశారు.
భైంసా పట్టణ ప్రాంతంలో అక్రమ ఇసుక కుప్పలపై భైంసా ఇన్స్పెక్టర్, తహసీల్దార్ లేఖతో అక్రమంగా తరలిస్తున్న వాహనాలను సీజ్ చేయడం జరిగింది. సారంగాపూర్ మండల పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 30 ట్రాక్టర్ల ఇసుక డంప్‌తో పాటు, ఒక జేసీబీని సీజ్ చేసి, కేసు నమోదు చేశారు. భైంసా రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కేసులు, లోకేశ్వరం పరిధిలో 13 ట్రాక్టర్ల అక్రమ ఇసుకను సీజ్ చేశారు. బాసర మండల పరిధిలో 2 కేసులు నమోదు చేసి, 50 టన్నుల ఇసుక, 2 టిప్పర్ వాహనాలు, 2 మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు.
ఇసుక స్మగ్లింగ్‌ను అలవాటుగా చేసుకున్న హాబిచువల్ నేరస్థులపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. జిల్లాలో ఎవరైనా ఇసుకను అక్రమంగా తరలించినా, నిల్వ ఉంచినా, సంబంధిత నిబంధనలను ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి చట్టపరమైన కఠిన చర్యలు అమలు చేస్తామని జిల్లా ఎస్పీ జానకి షర్మిల స్పష్టం చేశారు. ఇసుక అక్రమ రవాణా ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించడమే కాకుండా, పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తుందని, నదుల సహజ ప్రవాహం దెబ్బతినడం, భూగర్భ జలాల స్థాయి పడిపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆమె పేర్కొన్నారు.








