నిర్మల్ నియోజకవర్గంలో జొన్న, మొక్కజొన్న పంటల కొనుగోలు కోసం కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ కూచాడి శ్రీహరి రావు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకు వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన మంత్రి, నిర్మల్, సారంగాపూర్ మార్కెట్ యార్డులలో కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.
నియోజకవర్గంలో మొక్కజొన్న పంటను రైతులు అధికంగా సాగు చేశారని, కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని కూచాడి శ్రీహరి రావు మంత్రికి తెలియజేశారు. జిల్లాలో పది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన సూచించారు.
మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఈ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించి, మొదటి విడుతగా నిర్మల్, సారంగాపూర్ మార్కెట్ యార్డులలో కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
జొన్న పంట కొనుగోలుకు సంబంధించి రాష్ట్రంలో ఇంకా కేంద్రాలు ప్రారంభం కాలేదని, అయితే నిర్మల్ జిల్లాలో త్వరలోనే జొన్న పంట కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు కూచాడి శ్రీహరి రావు తెలిపారు. రైతుల తరపున ఆయన మంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు.












