నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పదవ తరగతి చదువుతున్న విద్యార్థి ఆడే రితేష్ (16) గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల మందలింపుతో మనస్తాపానికి గురై ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
అడెల్లి తండాకు చెందిన ఆడే రితేష్, శనివారం ఇంట్లో తన తాత కారు తీయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో తాత, నానమ్మ అతన్ని మందలించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన రితేష్ ఇంట్లోనే గడ్డి మందు సేవించాడు.
వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని నిర్మల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే, పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఆదివారం నిజామాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు.
మృతుడి తండ్రి జాదవ్ కేశవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనపై ఎస్సై శ్రీకాంత్ మాట్లాడుతూ, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

