మహబూబాబాద్ జిల్లాలో గంజాయి వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం వినూత్న చర్యలు చేపట్టింది. గంజాయి కార్యకలాపాలపై సమాచారం అందించిన వారికి రూ.5 వేల నగదు బహుమతి ప్రకటించింది.
జిల్లా ఎస్పీ శబరిష్ ఈ పథకాన్ని ప్రకటించారు. యువత ఆరోగ్యం, భద్రత, భవిష్యత్తును కాపాడటమే తమ లక్ష్యమని, ఇందుకోసం గంజాయి వినియోగం, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
గంజాయి వినియోగదారులు లేదా సరఫరా చేసే వ్యక్తుల వివరాలను 8712656999 మొబైల్ ఫోన్ నంబర్‌కు సమాచారం అందించిన వారికి రూ.5 వేల బహుమతి అందజేయబడుతుందని ఎస్పీ పేర్కొన్నారు.
ఈ బహుమతి పథకం ద్వారా ప్రజలను భాగస్వాములను చేసి, గంజాయి కార్యకలాపాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని పోలీస్ శాఖ భావిస్తోంది. సమాచారం గోప్యంగా ఉంచబడుతుందని హామీ ఇచ్చారు.








